వలస కూలీల తరలింపు.. రాష్ట్రాలకు కేంద్రం మరోసారి కీలక సూచనలు

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు తరలించడానికి అనుమతించిన కేంద్రం వీరికోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ మరోసారి కీలక సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాశారు. వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులను బస్సులు, శ్రామిక్‌ రైళ్లలో స్వస్థలాలకు పంపించాలని మరోసారి స్పష్టం చేశారు. అలాగే, వలస కూలీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన శిబిరాలు కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.

అంతేకాదు, వలస కూలీలు స్వస్థలాలకు చేరే వరకు వారికి నీళ్లు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అజయ్ భల్లా ఆదేశించారు. వలస కూలీలకు శ్రామిక్ రైళ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు వెంబడి నడవకుండా చూడాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నడిచివెళ్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, శిబిరాలకు చేర్చాలని తెలిపింది. అక్కడ సరైన వసతి, ఆహారం, తాగునీరు ఏర్పాటు చేయాలి. తర్వాత వారిని శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. శ్రామిక్ రైళ్లలో వలస కూలీల తరలింపును వేగవంతం చేయాలని పేర్కొంది. వైద్యం, పారిశుద్ధ్యం, ప్రైవేటు క్లినిక్‌లను తెరిచే అంశంపై కూడా అజయ్ భల్లా మరో లేఖ రాసి సూచనలు చేశారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కార్మికుల కాలినడక రైలు పట్టాల వెంబడి తమ సొంతూళ్లకు వెళుతుండగా రాత్రి కావడంతో ఔరంగాబాద్ వద్ద విశ్రాంతి తీసుకున్నారు. నడిచి నడిచి అలసిపోవడంతో పట్టాలపై నిద్రపోయిన వలస జీవులను గూడ్సు రైలు బలితీసుకుంది. అయితే, ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపమే కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here