సెబాస్టియన్ పిసి524 రివ్యూ

నటీనటులు: కిరణ్ అబ్బవరం, నువేక్ష, కోమలి ప్రసాద్, రోహిణి, సూర్య, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: రాజ్ కే నల్లి
సంగీతం: జిబ్రన్
నిర్మాతలు: సిద్ధా రెడ్డి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు
దర్శకుడు: బాలాజీ సయ్యపురెడ్డి

గతేడాది ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా ఆయన సెబాస్టియన్ పీసీ 24 అనే సినిమాతో వచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:
సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) రేచీకటి ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్. ఆయన జీవితంలో అమ్మ మేరీ (రోహిణి) మాత్రమే ఉంటుంది. తన తండ్రి కోరిక మేరకు పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. అయితే తనకు ఉన్న విషయం ఎవరికీ చెప్పడు. అలాంటి సమయంలో ఒక రోజు నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి.. తన ప్రాణ స్నేహితుడు.. ఒక డాక్టర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలుసుకుంటాడు సెబాస్టియన్. తన కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది అని తెలుసుకుని ఆమెకు న్యాయం చేయడానికి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది అసలు కథ.

కథనం:
తెలుగు ఇండస్ట్రీలో మర్డర్ మిస్టరీ చాలా వచ్చాయి. కానీ సెబాస్టియన్ మాత్రం కాస్త విభిన్నమైన పాయింట్ తో వచ్చింది. ఒక పోలీస్ మర్డర్ మిస్టరీ ఛేదించడం కొత్త విషయం కాదు. కానీ ఒక రేచీకటి ఉన్న పోలీస్ కానిస్టేబుల్.. తన కారణంగా చనిపోయిన అమ్మాయికి సంబంధించిన మర్డర్ మిస్టరీ ఛేదించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే దర్శకుడు బాలాజీ సయపు రెడ్డి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే తాను తీసుకున్న కథను మరింత పకడ్బందీగా చెప్పడంలో మాత్రం కాస్త తడబడినట్టు అనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ వరకు ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది ఈ సినిమా. హీరోకు ఉన్న లోపం చుట్టూ ఆకట్టుకునే సన్నివేశాలు అల్లుకున్నాడు దర్శకుడు బాలాజీ. వాటి నుంచే ఎంటర్టైన్మెంట్ పుట్టించాడు. రే చీకటి ఉన్న కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నప్పుడు జరిగే సంఘటనలు ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎంటర్టైనింగ్ ప్రాంతాల్లో మొదలైన సినిమా మెల్లమెల్లగా సీరియస్ నోట్ లోకి వెళుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా రాసుకున్నాడు.
తన కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది అన్న విషయం తెలిసిన తర్వాత.. సెబాస్టియన్ ఆ కేసులో ఉన్న వాళ్లను పట్టుకోవడానికి వేసే ప్లాన్ బాగుంటుంది. అలా ఒక మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన దర్శకుడు బాలాజీ.. ఆ తర్వాత మాత్రం సేమ్ టెంపో కొనసాగించలేకపోయాడు. సెకండ్ హాఫ్ చాలా వరకు నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా స్లో అయినట్లు అనిపించినా మధ్యలో మళ్ళీ ఫ్లో మిస్ కాకుండా మంచి సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు బాలాజీ. కిరణ్ అబ్బవరం ఫర్ఫార్మెన్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ముఖ్యంగా ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఇలాంటి భిన్నమైన కథ ఎంచుకోవడం కిరణ్ లోని ప్రత్యేకతను తెలుపుతుంది. మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో కాస్త నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్ కు మళ్ళీ దారిలో పడుతుంది.

నటీనటులు:
కిరణ్ అబ్బవరం మరోసారి ఆకట్టుకొన్నాడు. తొలి రెండు సినిమాల్లో మంచి ఈజ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఈసారి రేచీకటి ఉన్న పాత్రలో అదరగొట్టాడు. క్యారెక్టర్ ను బాగా అర్థం చేసుకొని నటించాడు కిరణ్ అబ్బవరం. హీరోయిన్ నువేక్ష తన పాత్ర వరకు బాగా చేసింది. మరో కీలకమైన పాత్రలో కోమలి ప్రసాద్ ఆకట్టుకుంది. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా ఆయన అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుడు సూర్య, రోహిణి, ఆదర్శ్ బాలకృష్ణ, హీరో ఫ్రెండు పాత్రలో నటించిన తేజ ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:
ఈ సినిమాకు సంగీత దర్శకుడు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. టైటిల్ సాంగ్, హెలి పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. దర్శకుడు బాలాజీ ఒక మంచి పాయింట్ తీసుకున్నాడు. కానీ అది తెరకెక్కించే ప్రయత్నంలో అక్కడక్కడా ఫ్లో మిస్ అయ్యాడు. అయినా కూడా బాగానే ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాయింట్ తీసుకొని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. స్లో నెరేషన్ ఒక్కటే సెబాస్టియన్ సినిమాకు కాస్త ప్రతికూలంగా ఉన్నా.. డిఫెరెంట్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం మంచి ఛాయిస్.

చివరగా:
సెబాస్టియన్ పిసి 524.. డిఫరెంట్ మర్డర్ మిస్టరీ..

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here