గర్బిణిని కాపాడిన కానిస్టేబుల్.. అభిమానంతో తన బిడ్డకు అతడి పేరు

లాక్‌డౌన్ వేళ కష్టంలో ఉన్న తనను కాపాడిన కానిస్టేబుల్‌పై అభిమానాన్ని చాటుకుందో మహిళ. తనకు పుట్టిన బిడ్డకు ఆ కానిస్టేబుల్ పేరు పెట్టుకుంది. ఢిల్లీకి వాజీపూర్ ప్రాంతంలో విక్రమ్, అనుప దంపతులు నివాసం ఉంటున్నారు. అనుపకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కావడంతో వాహనాలు అందుబాటులో లేకుండా పోయాయి.. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది. అప్పుడే విక్రమ్‌కు ఓ ఆలోచన వచ్చింది.

విక్రమ్ వెంటనే తనకు దగ్గరలో ఉన్న అశోక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. తన సమస్యను వివరించాడు.. తన భార్య పురిటి నొప్పులతో ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సాయం చేయమని కోరాడు. వెంటనే దయావీర్ అనే కానిస్టేబుల్ దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు.. కారులో ఎక్కించుకుని హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇదంతా జరిగింది.

అనుపకు సాధారణ కాన్పు కాగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. సరైన సమయానికి తమను ఆస్పత్రికి చేర్చిన దయావీర్‌పై ఈ దంపతులు ప్రశంసలు కురిపించారు. తమ కుమారుడికి దయావీర్ పేరు పెట్టి అభిమానాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కోసం ఎదురు చూసినా రాలేదని.. సరైన సమయానికి తమను కానిస్టేబుల్ దయావీర్ ఆస్పత్రికి తీసుకెళ్లారని దంపతులు చెప్పుకొచ్చారు. అందుకే కృత‌జ్ఞ‌త‌గా ఆయన పేరు పెట్టుకున్నామని చెబుతున్నారు.

బాబుకు తన పేరు పెట్టడంపై కానిస్టేబుల్ దయావీర్ స్పందించారు. తనకు సంతోషంగా ఉందని.. ఇది తనకు ఓ గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. ఇటు కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ఇలాంటివి తమలో ఇంకా ఉత్సాహాన్ని నింపుతాయని పోలీసులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here