‘వుహాన్‌లో వైరస్ వ్యాప్తికి ముందు ఏదో జరిగింది.. పూర్తి సమాచారం రావాల్సి ఉంది’

కరోనా వైరస్‌ విషయంలో చైనా, అమెరికాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. వైరస్‌ను జన్యుపరంగా వుహాన్ ల్యాబ్‌లోనే తయారు చేశారని, డిసెంబరు తొలివారం నాటికే మహమ్మారి వ్యాప్తి చెందినా ప్రపంచ దేశాలకు తెలియనీకుండా వ్యవహరించిందని డ్రాగన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. తాజాగా, మరోసారి చైనాపై అమెరికా విదేశాంగ మంత్రి విమర్శలు గుప్పించారు. కోవిడ్-19 వ్యాప్తిపై చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆయన మండిపడ్డారు. వాస్తవానికి గత ఏడాది నవంబరులోనే ఈ వైరస్‌ గురించి చైనాకు తెలిసే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అయినా ప్రపంచానికి మాత్రం ఆలస్యంగా దాని వివరాలను బయటపెట్టిందని ఆరోపించారు. కరోనా గురించి చైనా నుంచి అమెరికాకు ఇంకా చాలా సమాచారం అందాల్సి ఉందని పాంపియో అన్నారు. వుహాన్‌లో వెలుగుచూసిన సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ వాస్తవ నమూనా కూడా తమకు ఇంకా చేరలేదని వ్యాఖ్యానించారు.

వుహాన్‌లో పురుడుపోసుకున్న గురించి మరింత లోతుగా అవగాహన చేసుకోడానికి ఇతర దేశాలతో కలిసి అమెరికా పనిచేస్తోందని పాంపియో పేర్కొన్నారు. వైరస్ ఎలా పుట్టిందో వివరించాల్సిన బాధ్యత చైనాపై ఉందన్నారు. తమ దేశంలో మరణాలకు, ఆర్థిక వ్యవస్థ నష్టపోవడానికి కారణమైవారు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. దౌత్యపరంగా అన్ని దేశాలకు సహాకారం, ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్డడానికి తోడ్పాటు అందజేస్తామని, తిరిగి త్వరలోనే అంతర్జాతీయ వాణిజ్యం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వుహాన్‌లో వైరస్ పుట్టడానికి ముందు ఏం జరిగిందో అవగాహన చేసుకోడానికి కొన్ని దేశాలతో కలిసి పనిచేస్తున్నామని, డిసెంబరు తొలివారం నాటికే చైనా ప్రభుత్వానికి వైరస్ గురించి తెలుసేమోనని అభిప్రాయపడ్డారు. ‘వారు (చైనా) ఒక దేశంగా అత్యంత ప్రాథమిక బాధ్యతలను పాటించడంలో విఫలమయ్యారు.. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారు. తరువాత చాలా పనులు చేశారు. వాటిని కప్పిపుచ్చుకోడానికి సాకులు వెదుకుతున్నారు’అని మండిపడ్డారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మహమ్మారి నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో దారుణంగా విఫలమైందని దుయ్యబట్టారు. ‘తాము మళ్ళీ అలా జరగనివ్వం, ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం.. ఇది ఫలితాన్ని ఇస్తుందని, చైనా లేదా మరే దేశం నుంచి ఇలాంటివి జరగుతాయనే ముప్పును తగ్గిస్తుంది’అని పాంపియో అన్నారు. మరణాలు విషయంలోనూ చైనా చెబుతున్న లెక్కలు సరైనవి కావనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరణాలు, కేసుల సంఖ్యను తక్కువచేసిన చూపుతోందని దుయ్యబట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here