శ్రామిక్ రైళ్ల టికెట్ ఛార్జీల దుమారం.. ఇదిగో కీలక వివరాలు

శ్రా మిక్ రైళ్లలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఛార్జీల చెల్లింపు వ్యవహారంపై దుమారం రేగుతోంది. వలస కార్మికయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే వర్గాల ద్వారా కీలక వివరాలు తెలిశాయి. శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులకు ఛార్జ్ చేస్తున్న మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నట్లు ఇండియన్ రైల్వేకు చెందిన ఓ అధికారి తెలిపారు. దీంతో వలస కూలీలకు రైళ్లలో అదనంగా ఆహారం, మంచి నీటి బాటిళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.

వలస కార్మికుల తరలింపునకయ్యే ఛార్జీల్లో 85 సబ్సిడీ ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం భరిస్తున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. సబ్సిడీ ఇచ్చిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా వలస కార్మికుల తరలింపుపై ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలుస్తోంది. వలస కార్మికుల తరలింపు కోసం భారత రైల్వే ఇప్పటివరకు 34 రైళ్లను నడిపింది. ఈ రైళ్లకు సంబంధించిన ఖర్చులన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు (మహారాష్ట్ర మినహా) చెల్లించాయి.

తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి బయల్దేరిన శ్రామిక్ రైళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఖర్చుల కింద అయిన తమ వాటా మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. తొలి శ్రామిక్ రైలును రిసీవ్ చేసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం కూడా తన వాటా సొమ్మును ఇప్పటికే జమ చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం. ఈ అంశంపై ఇండియన్ రైల్వే ప్రకటన చేయాల్సి ఉంది.

శ్రామిక్ రైళ్లలో ఏర్పాట్లు ఇలా..

కార్మికుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల బోగీల్లో ఇండియన్ రైల్వే ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) ఉండేలా.. ఒక్కో బెర్తును వదిలేస్తూ సీట్లు కేటాయిస్తోంది. కార్మికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత బోగీల డోర్లకు తాళాలు వేసి తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారు. ఇందు కోసం ఒక్కో సీటుకు స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీతో పాటు రూ.30 సూపర్ ఫాస్ట్ ఎక్సెప్రెస్ ఛార్జ్, రూ.20 శ్రామిక్ స్పెషల్ ఛార్జెస్ అదనంగా వసూలు చేస్తోంది. ఇండియన్ రైల్వే ఇప్పటివరకు 34 శ్రామిక్ రైళ్లను నడిపింది.

వలస కార్మికుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేస్తోంది. దీనిపై అక్కడ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కూలీల తరలింపుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. శ్రామిక్ రైళ్లలో ప్రయాణిస్తున్న వలస కూలీలు తమ ప్రయాణ నిమిత్తం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ మొత్తాన్ని భరిస్తాయని వెల్లడించారు. దీనిపై ఓ వీడియో విడుదల చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here