ప్రయివేట్ హాస్పిటల్‌లో కరోనా చికిత్స .. ప్రాణం దక్కకపోగా రూ.16 లక్షల బిల్లు చేతిలో పెట్టారు!

సంబంధిత లక్షణాలతో ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరిన ఓ 74 ఏళ్ల వ్యక్తి, 15 రోజుల చికిత్స అనంతరం చనిపోయాడు. అయితే చికిత్సకు ఆ హాస్పిటల్ రూ.16 లక్షలు బిల్లు చేసి, మృతుడి కొడుకు చేతిలో పెట్టింది. ఈ బిల్లును చూసి సదరు కుమారుడు షాక్ తిన్నాడు. ఈ ఘటన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. మధ్యతరగతికి చెందిన ఏ వ్యక్తీ చికిత్స కోసం రోజుకు రూ.లక్ష ఖర్చుచేస్తాడని తాను అనుకోను. ఈ బిల్లు మాకు చాలా షాక్ ఇచ్చింది అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అతడి కుమారుడు వ్యాఖ్యానించాడు.

అయితే, బాధితులు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని డైరెక్టర్ మన్‌ప్రీత్ సోహల్ కొట్టిపారేశాడు. ‘మృతుడు మార్చి 31న తమ హాస్పిటల్‌లో చేరాడు, అప్పటికే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది… హాస్పిటల్‌లో చేరేటప్పటికి పలు అనారోగ్య సమస్యలతోపాటు అవయవాలు కూడా అతడికి పనిచేయడంలేదు.. అతడి ప్రాణాలు కాపాడటానికి తమ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు… ఏప్రిల్ 15న అతడు మృతిచెందాడు’ అని అన్నాడు.

కరోనా సంబంధిత చికిత్సకు ప్రయివేట్ హాస్పిటల్స్ భారీగా డబ్బులు వసూలుచేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేసినా వాటిని పరిగణనలోకి తీసుకోవడంలేదు. మృతుడి కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. మందులు, ఆహారం కోసం రూ.8.6 లక్షలు, కోవిడ్ చార్జెస్ కింద రూ.2.8 లక్షలు బిల్లులో వేశారన్నాడు. అధికారుల ఆదేశాలను కూడా ఏకపక్షంగా అధిగమిస్తున్నారని విమర్శించాడు.

కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉంచారని, చికిత్సకు అయే ఖర్చు గురించి కనీసం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డాడు. ‘హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన రోజు రూ.60,000 చెల్లించాను.. ఒక రోజు తరువాత, ఆయనకు డయాలసిస్, వెంటిలేటర్‌పై ఉంచాల్సి ఉంటుందని సమాచారం అందింది. దీనికి మెయిల్ ద్వారా సమ్మతి తెలిపాను’అని అన్నారు.

హాస్పిటల్‌లో చేరడానికి కొద్ది రోజుల ముందే నిర్వహించిన పరీక్షల్లో కిడ్నీ పనితీరు సక్రమంగానే ఉన్నట్టు తేలింది.. తర్వాత బిల్లు పెరుగుతూనే ఉంది. రూ.3.4 లక్షల చెల్లించాను.. మళ్లీ రెండు రోజుల తర్వాత బిల్లు చెల్లించకపోతే చికిత్స నిలిపివేస్తామని అకౌంట్స్ విభాగం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది.. ఆయన చనిపోయిన తర్వాత శ్మశానికి అంబులెన్స్‌లో తరలించడానికి రూ.8,000 కట్టించుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

మృతుడికి ఇటీవల గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందని నానావతి హాస్పిటల్ వర్గాలు పేర్కొంటున్నాయి. హాస్పిటల్‌లో చేరిన తర్వాత రోగనిరోధక వ్యవస్థ క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందజేసినట్టు తెలిపింది. కిడ్నీలు పనితీరు కూడా మందగించడంతో పరిస్థితి విషమించిందన్నారు. ఇలాంటి రోగులకు చికిత్స కోసం ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా రోజుకు రూ.లక్షల ఛార్జ్ చేస్తాయని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here