రాములమ్మ ఏం చేస్తుందో చెప్పండర్రా

రాములమ్మ క్యారెక్ట్రర్ నే రాజకీయ సోపానంగా మలుచుకొన్న విజయశాంతి… తెలుగు సినీ చరిత్రలోనే ఓ ఫైర్ బ్రాండ్. తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలకు దీటుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో లేడీ అమితాబ్ గా ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్నారు. తెలంగాణ నేపథ్యం, యాస, సంస్కృతి ఉన్న చిత్రాల్లో నటించిన విజయశాంతి…  సినిమాల నుంచే రాజకీయ జీవితానికి బాటలు వేసుకున్నారు. మొదట బీజేపీలో చేరారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలంగాణ మలి దశ ఉద్యమం జోరందుకోవడంతో బీజేపీతో విభేదించి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి సంచలనంగా మారారు. దాదాపు నాలుగేళ్లు పార్టీని నడిపి 2009లో టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆమె జనాకర్షణ శక్తి తో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్… ఆమెను ఎన్నికల బరిలో నిలిపింది. విజయశాంతి లోకల్ కాకపోయినా అప్పటి ఎన్నికల్లో మెదక్ ఎంపీగా ఆమె గెలవడం సంచలనమైంది. మహామహులు మట్టికరిచినా ఆమె విజయం సాధించడం విశేషంగా నిలిచింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, విజయశాంతి మాత్రమే విజయం సాధించారు. అందుకే విజయశాంతిని కేసీఆర్ ఎన్నోసార్లు చెల్లెలుగా చెప్పుకున్నారు. స్వయంగా ఆమె ఇంటికే వెళ్లి రాఖీ కట్టించుకున్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రాములమ్మ… తెలంగాణకు ముందు, తెలంగాణ సిద్ధించిన తరువాత మాత్రం అసలు కనిపించడమే మానేశారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల కోసం పార్టీలన్నీ రంగం సిద్ధం చేసుకుంటుంటే… రాములమ్మ ఏం చేస్తోందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎంపీగా తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు విజయశాంతి. పార్లమెంటు వేదికగా తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కేసీఆర్ తో కలిసి సభను స్తంభింపజేశారు. సభలో ఇతర చర్చలు జరగకుండా అడ్డుకున్నారు. హైకమాండ్ కు భయపడి కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు సైలెంట్ గా ఉన్న సమయంలోనే విజయశాంతి తెలంగాణ గళాన్ని లోక్ సభ ద్వారా దేశమంతా వినిపించారు. పెద్దరికం కారణంగా కొన్నిసార్లు కేసీఆర్ తన సీటు వద్దే నిశ్శబ్ద నిరసన తెలుపగా.. విజయశాంతి మాత్రం జై తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. ఆమె ఒక్కరే స్పీకర్ పోడియంలో బైఠాయించి నిరసన కొనసాగించారు. 
విజయశాంతి అదే దూకుడును తెలంగాణ వచ్చాక కూడా కొనసాగిస్తారని అంతా భావించారు. అయితే రాష్టం ఏర్పడిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. 2014 ఎన్నికల సందర్భంగా ఆమె సీటుకే ఎసరు పెట్టారు కేసీఆర్. స్వయంగా కేసీఆరే మెదక్ ఎంపీగా పోటీ చేయడంతో ఆమెకు టికెట్ రాకుండాపోయింది. దీన్ని ముందే పసిగట్టిన విజయశాంతి టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారు. టికెట్ కోసం అధినేతనే ఎదిరించారు. మెదక్ కాకపోతే మరోచోటనైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే విజయశాంతితో గులాబీ పెద్దలకు తేడా రావడంతో ఆమెకు టికెట్ నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇక అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడా  కనిపించడం లేదు. దాదాపుగా తెరమరుగయ్యారనే చెప్పుకోవాలి. స్వయంగా రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డి సభకు కూడా విజయశాంతి హాజరు కాకపోవడంతో.. ఆమె కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అన్న అన్న అనుమానాలు ఆ పార్టీ నేతలకే కలుగుతున్నాయి. 
అయితే కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లేకపోవడంతోనే ఆమె సైలెంట్ అయ్యారని ఆమె అనుచరులు చెబుతున్నారు. కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వలేదని అప్పట్లో విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సిట్టింగ్ స్థానం త్యాగం చేసినా తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అదే సందర్భంలో విజయశాంతి పాతగూటికి వెళతారనే ప్రచారం సాగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో మరోసారి కమలం తీర్థం పుచ్చుకోవాలని భావించారు. అయితే బీజేపీ సీనియర్లు ఆమె చేరికను వ్యతిరేకించడంతో కమలం దారి పట్టలేక, కారు ఎక్కలేక, హస్తంతో దోస్తీ చేయలేక, ఆంధ్రా పార్టీగా ముద్రపడ్డ టీడీపీ సైకిల్ ఎక్కలేక రాజకీయంగా సైలెంట్ కావాల్సి వచ్చింది. ఇదే క్రమంలో తమిళనాట జయలలిత మరణం తర్వాత.. శశికళకు మద్దతు ప్రకటించారు విజయశాంతి. దీంతో తమిళ రాజకీయాల వైపు విజయశాంతి వెళతారనే చర్చ సాగినా… ఆమె మాత్రం అటువైపు మొగ్గు చూపలేదు. అయితే ఎన్నికల సమయం దగ్గర ప‌డుతుండ‌టంతో  అన్ని రాజకీయ పార్టీలూ జనం బాట పట్టాయి. అయినా విజయశాంతి జనంలో లేకపోవడం.. ప్రజా సమస్యలపై గళం విప్పకపోవడంతో ఇక విజయశాంతి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా వాసులు. 
 ఇటీవ‌ల దాదాపు సైలెంటయిన విజ‌య‌శాంతి సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరువు నుంచి రానున్న ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ లో తెలంగాణ గళంగా, కేసీఆర్ కు బలగంగా ఉన్న రాములమ్మ.. ఈసారి సంగారెడ్డిలో ఏ పార్టీ నుంచి ప్రత్యక్షమవుతారు? ఏ పార్టీ ఆమెను చేరదీస్తుంది అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here