ఉత్తమ్ ఏం చేయాలో చెప్మా…!

“చెయ్యాలి… ఏదో ఒకటి చెయ్యాలి… లేకపోతే వెనుకబడి పోతాం. అధికారంలోకి రావడం కాదు కదా.. కనీసం ప్రతిపక్ష హోదా గౌరవాన్నయినా నిలుపుకోలేకపోతాం. తొందరపడకపోతే ఇక ఎప్పటికీ కోలుకోలేం”. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న ఆదుర్దా. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నా… ఇప్పుడున్న సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్నా ప్రజల్లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అందుకే త్వరలోనే ఓ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. 
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి దృష్టీ ఉత్తమ్ కుమార్ మీదే ఉంది. అనేక సవాళ్లతో కూడిన పార్టీని ముందుకు నడిపించడంలో… పార్టీ సీనియర్ల విమర్శలు సహా.. ఉత్తమ్ అన్నీ భరిస్తున్నారు. అందరూ ఉత్తమ్ నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంతర్గత సమావేశాల్లో కూడా సీనియర్లు సలహాలు ఇవ్వడం కన్నా ఉత్తమ్ కుమార్ పనితీరే టార్గెట్ గా కామెంట్లు గుప్పిస్తున్నట్టు సమాచారం. గాంధీభవన్ లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో అదే తీరును ప్రదర్శిస్తూ… అన్ని తప్పులూ ఉత్తం వైపే చూపిస్తూ.. మిగతానేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారని సమాచారం. రాష్ట్ర్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా, ఏఐసీసీ నేత కొప్పుల రాజు ముందు సీనియర్లంతా ఉత్తమ్ ను టార్గెట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. 
 ప్రభుత్వం అనేక తప్పిదాలు చేస్తూ ప్రధాన ప్రతిపక్షానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నా.. పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రజామద్దతు కూడగట్టలేక విఫలమవుతోందని పార్టీ సీనియర్ నేతల సమావేశంలో.. వీహెచ్ కుంతియా దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. నేరెళ్ల, మానకొండూరు ఘటనల్లో పార్టీ ఏం చేసిందని వీహెచ్ ఆగ్రహంతో ఊగిపోయారని తెలిసింది. వారికి అండగా ఉండి పోరాటం చేయడంలో… ఆందోళనలు కొనసాగించడంలో పార్టీ విఫలమవుతోందని హన్మంతరావు మండిపడ్డట్టు సమాచారం. వీలైనంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో పీసీసీ ఆలస్యం చేస్తోందని వీహెచ్ ఫిర్యాదు చేయడంతో మిగతా నేతలంతా.. ఆయనకు మద్దతు తెలిపారని తెలుస్తోంది. ఉత్తమ్ పై అందరూ ఆరోపణలు చేస్తున్నా.. పక్కనే ఉన్న జానా, భట్టి సైలెంటుగా ఉండడంతో అందరూ ఉత్తమ్ నే టార్గెట్ చేసి మాట్లాడినట్లు చెప్పుకుంటున్నారు. 
జూన్ 1న రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో చెప్పిన అంశాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ సందేశ్ యాత్రలు చేయాలని నిర్ణయించినా… ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇక పార్టీలోనే ఆరోపణలు-ప్రత్యారోపణలు ఎక్కువ కావడంతో ఫోకస్ ను కాస్త పార్టీ వైపు మరల్చాలని భావించారు. అందుకే రాహుల్ సందేశ్ యాత్రతోపాటు… బడుగుల ఆత్మగౌరవ యాత్ర పేరుతో… రాష్ట్ర్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగా మరో పది రోజుల్లో యాత్ర తేదీలలను ఖరారు చేయాలని సమావేశం తీర్మానించింది. పార్టీ సీనియర్లంతా పాల్గొనే విధంగా ఈ యాత్రను డిజైన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 
 కుంతియా రాష్ట్ర్ర ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఇది రెండో మీటింగ్ కావడంతో నాయకులంతా ఉత్తమ్ కుమార్ నే టార్గెట్ చేసినా… కుంతియా మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు సమాచారం. పార్టీ మొదటి మీటింగ్ అంశాలు ఫిర్యాదుల రూపంలో ఇప్పటికే ఢిల్లీ చేరడంతో… ఈసారి కుంతియా ఎక్కడా, ఎవ్వరికీ మద్దతుగా మాట్లాడకుండా సమావేశం ముగించుకొని వెళ్లినట్లు సమాచారం. కుంతియా తీరుపై గుర్రుగా ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here