“వైఎస్సార్ గుర్తుగా – జ‌గ‌న్ కు తోడుగా”

సలహాదారు, అమలు కర్త భేటీ అయ్యారు. ఓటమిపై లోతుగా విశ్లేషించుకున్నారు. తరువాత అనుసరించాల్సిన కొత్త వ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో అవగాహనకు వచ్చారు. దిద్దుబాటు చర్యల దిశగా వేగంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో ఓటమిపై వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత వీరు సమాలోచనలు జరపడం మీద ఆసక్తి నెలకొంది.
ఇటీవల జ‌రిగిన నంద్యాల ఉపఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ పోస్టుమార్టం నిర్వ‌హించారు. వ్యూహక‌ర్త‌గా రంగంలోకి దింపిన ప్ర‌శాంత్ కిషోర్… ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత తొలిసారి జ‌గ‌న్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణ‌ల‌పై ఇరువురూ విశ్లేషించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌శాంత్ కిషోర్ చేసిన స‌ర్వేలో వైసీపీ నంద్యాల‌లో విజ‌యం సాధిస్తుంద‌ని నివేదిక‌లు వ‌చ్చాయి. కానీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రివ‌ర్స్ కావ‌డంతో.. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది.. పార్టీ వాస్తవ పరిస్థితేమిటీ.. అన్న కోణంలో మరోసారి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై ప్ర‌శాంత్ కిషోర్.. జగన్ కు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీకి ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ దాన్ని ఓట్లుగా మలుచుకోవ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు ప్ర‌శాంత్ కిషోర్ పేర్కొన్నట్టు చెబుతున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌ల‌పేతం చేస్తే త‌ప్ప రానున్న ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షాన్ని ఎదుర్కోవ‌డం సాధ్యం కాద‌ని పీకే కుండబద్దలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. 
 త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న తరుణంలో వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు “వైఎస్సార్ గుర్తుగా – జ‌గ‌న్ కు తోడుగా” అనే పేరుతో 60 రోజుల కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌శాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొద‌టి విడ‌త‌లో న‌వ‌ర‌త్నాల స‌భ‌లు, ఆ త‌ర్వాత వైఎస్సార్ కుటుంబం విజ‌య శంఖరావం పేరుతో కార్యక్ర‌మాల‌ు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఇంతవ‌ర‌కు న‌వ‌ర‌త్నాల స‌భ‌ల‌ను వైసీపీ నేత‌లు పూర్తి చేయ‌క‌పోవ‌టంపై జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప్ర‌శాంత్ కిషోర్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ కార్య‌క్ర‌మాలపై నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరిస్తే అనుకున్న ల‌క్ష్యాల‌ు సాధించలేమ‌ని పీకే నొక్కి చెప్పినట్లు సమాచారం. ఇప్ప‌టికైనా వీలైనంత త్వ‌ర‌గా నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ కు పీకే సూచించారు. 
మొత్తమ్మీద ఎన్నిక‌ల త‌రువాత మ‌ళ్లీ సీన్లోకి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్.. వైసీపీకి ఏ విధంగా ఉప‌యోగప‌డ‌తారో చూడాల‌ంటున్నాయి ఆ పార్టీ వ‌ర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here