కడప జిల్లా తెలుగుదేశం కొంపలో కుంపటి

అందరిదీ ఒకే పార్టీ. అయినా ఏదో తెలియని అపనమ్మకం. ఎమ్మెల్యే ఏదో చేస్తున్నాడని జడ్పీటీసీలకు.. జడ్పీటీసీలు ఎక్కడ ఎదిగిపోతారోనని ఎమ్మెల్యే.. ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. ఈ అనుమానాల మధ్య అభివృద్ధి పడకేయడమే కాదు… ప్రభుత్వ కార్యాలయాల్లో పింఛను కూడా ఇప్పించుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో ఆ రెండు వర్గాల మధ్య అనుమానాలు మరింతగా ముదిరిపోయి రాజీనామాల దాకా వచ్చింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం టీడీపీలో ముసురుకుంటున్న ముసలం.. రేపో, మాపో చంద్రబాబునాయుడు దగ్గరకూ చేరే అవకాశం ఉంది. 
బద్వేలు నియోజకవర్గ టీడీపీలో మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరింది. ఆది నుంచీ బద్వేలు తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలున్నా  ఇప్పుడవి ముదిరుపాకాన పడ్డాయి. గతంలో బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలోకి వస్తున్న సమయంలోనూ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నచ్చజెప్పి జయరాములును పార్టీలో చేర్చుకున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతికి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు అస్సలు పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే జయరాములు పార్టీలో చేరిన తరువాత.. ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా బద్వేలులో మూడు వర్గాలుగా చీలిపోయిన తెలుగు తమ్ముళ్లు ప్రతి విషయంలోనూ ఏదో ఒక సమస్య నేపథ్యంలో గొడవపడి పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు. ఇటీవల జరిగిన బద్వేలు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలోనూ రెండు వర్గాలు ఒకరిపైనొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. మొదట్నుంచి కూడా మార్కెట్‌యార్డు విషయం మొదలుకొని పార్టీ పదవుల వరకు ప్రతి విషయంలోనూ రెండు వర్గాల మధ్య అంతర్గతంగా యుద్ధ వాతావరణం కొనసాగుతూ వస్తోంది.  
మొన్నటి వరకు పరిస్థితి అలా ఉంటే… ఇప్పుడు అధికార పార్టీలో మొదలైన రాజకీయ రగడ తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు రాజీనామాలు చేసిన వ్యవహారం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక సమస్యలపై ఎవర్ని కలిసినా పనులు కావడం లేదని, ఎన్నికల్లో అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా పనులు చెయ్యకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆగ్రహానికి గురైన బద్వేలు జెడ్పీటీసీ బీరం శిరీష, గోపవరం జెడ్పీటీసీ రమణయ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా వీరి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని.. వర్గ విభేదాల నేపథ్యంలో పనులు జరగనప్పుడు పదవిలో ఎందుకు కొనసాగాలంటూ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు కరాఖండిగా చెబుతున్నారు. రాజీనామాల వ్యవహారంపై ఎమ్మెల్యే జయరాములు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం ఇవ్వలేదని సమాచారం. ఇది వరకే పార్టీతో పాటు ప్రభుత్వ పదవుల విషయంలోనూ పైచేయి సాధించేందుకు ఎవరికి వారు పావులు కదుపుతుండగానే.. జెడ్పీటీసీల రాజీనామాల వ్యవహారం చోటు చేసుకుంది. ఇదంతా ఎమ్మెల్యే జయరాములు నేతృత్వంలోనే జరిగిందని భావిస్తున్న విజయమ్మ వర్గం కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. 
ఈ క్రమంలో బద్వేలు ఎమ్మెల్యే జయరాములతో కలిసి బద్వేలు, గోవపరం జెడ్పీటీసీ సభ్యులు శిరీష, రమణయ్యలు విజయవాడకు బయలుదేరనున్నట్లు తెలియవచ్చింది. త్వరలోనే విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడుతోపాటు మంత్రి లోకేష్‌ ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని, పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నట్లు సమాచారం.  మండలంలో తమకు ప్రభుత్వాధికారులు విలువ ఇవ్వడం లేదని.. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు తమను పిలువలేదని.. తను వెళ్లి అడిగితే జాబితా ఇంతకుముందే పంపించామని చెప్పడం బాధ కలిగించాయని జడ్పీటీసీలు పేర్కొంటున్నారు. కనీసం ఒక పింఛన్, ఒక రేషన్‌కార్డు ఇప్పించుకోలేని స్థితిలో ఉన్న తమకు  పదవి అవసరం లేదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే అండతోనే అధికారులు తమను పట్టించుకోవడం లేదని పరోక్షంగా విమర్శిస్తున్నారు. మరి… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిస్తే… ఆయనకున్న అనుభవంతో ఏదో పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here