సాక్షాత్ సీతారామ చంద్రులు నడయాడిన నేలే ఈ రామతీర్థం

రాములోరికి పెళ్లంటే ఊరంతా పందిళ్లే.. అందరూ పెళ్లి పెద్దలే.. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామతీర్ధంలో కూడా రామనవమి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి..  ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్ధం.. రామనవమి వేడుకలంటే చాలు.. ఇక్కడికి చుట్టుపక్కల నుంచి జనం పోటెత్తుతారు. ఈ ఆలయానికి ఉన్న స్థలపురాణం మహత్తు అలాంటిది మరి..

త్రేతాయుగంలో వనవాసం సమయంలో సాక్షాత్ సీతారామ చంద్రులు నడయాడిన నేల రామతీర్థం. ఆలయానికి ఉత్తరాన ఉన్న కొండలపై సీతారాములు సంచరించిన ఆనవాళ్లు నేటికి ఉన్నాయంటూ స్థానికులు చెప్తుంటారు. రామతీర్థం ఆలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ద్వాపరయుగం నాటివిగా పేర్కొంటారు. ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేసే సమయంలో స్వయంభుగా వెలసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు కొద్దిరోజులు పూజలు చేశారు.అనంతరం ఈ విగ్రహాలు నీటిమడుగులో భద్రపరిచారు.. 16వ శతాబ్దంలో ఓ పశువుల కాపరి అయిన మూగ మహిళకు రాములవారు దర్శనమిచ్చారని స్థలపురాణం చెబుతోంది. ఆమూగ మహిళలకు మాటలు వచ్చేలా చేసి తన విగ్రహాలు నీటిమడుగులో ఉన్నాయని ఇక్కడ ఆలయం కట్టి పూజలు చేయాలని  చెప్పి అదృశ్యమయ్యారు. రాములవారు చెప్పినట్లే ఆ మహిళ కుంభిలీపురం నగరాన్ని పాలిస్తున్న పూసపాటి వంశస్థుడు సీతారామచంద్ర మహారాజును సంప్రదించగా అంతకుముందు రోజే స్వామివారు రాజుకు సైతం స్వప్నంలో కనిపించి ఇదే విషయాన్ని చెప్తారు. దాంతో నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణుల విగ్రహాలను బయటకు తీసి రాజుగారు ఆలయాన్ని నిర్మించారు అనేది స్థల పురాణం. తీర్థం అంటే నీరు నీటిలో దొరికిన రాములవారి విగ్రహాలు కావడంతో ఆ గ్రామానికి రామతీర్థం అని పేరొచ్చినట్లు ప్రతీతి. 500 ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఆలయం రామతీర్థం సీతారామ దేవస్థానం. ఆనాటి నుంచి నేటి వరకు సీతారామ లక్ష్మణ స్వాములు భక్తుల కొంగు బంగారంగా నిర్విరామంగా పూజలందుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here