జియో ఫోన్ కి పోటీగా ఇదిగో వచ్చేసింది కొత్త ఫోన్

ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ, రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోన్ కు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ‘భారత్-1’ పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్ ను విడుదల చేసింది. రిలయన్స్ జియోతో పోలిస్తే కాస్తంత అధికంగా, అంటే రూ. 2,200కు లభించే ఫోన్ లో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్ తోనే లభిస్తాయి.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే భారత్-1 చాలా చౌకగా వచ్చినట్టని నిపుణులు లవ్యాఖ్యానించారు. రెండేళ్ల కాలానికి జియో వాడుకుంటే, రూ. 5,172 అవుతుందని, భారత్-1కు రూ. 4,528 మాత్రమే అవుతుందని, ఇక మూడేళ్ల కాలపరిమితికి పరిశీలిస్తే, జియో ఫోన్ కు రూ. 6,008 వెచ్చించాల్సి రాగా, భారత్-1కు రూ. 5,692 మాత్రమే అవుతుందని తేల్చి చెబుతున్నారు.
కాగా భారత్-1 ఫీచర్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ రామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2.4 అంగుళాల స్క్రీన్, 2 ఎంపీ/ వీజీఏ కెమెరాలు, భారత భాషలకు సపోర్ట్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఎటువంటి యాప్ కావాలన్నా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి వుంటుంది. ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లో జియో కన్నా, వేగంగా ప్రాచుర్యంలోకి వస్తుందని, బీఎస్ఎన్ఎల్ కు ఉన్న నెట్ వర్క్ అందుకు సహకరిస్తుందని టెలికం సెక్టార్ భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here