దున్నపోతు ఖరీదు 21 కోట్లు!

ఈ దున్నపోతుల ఖరీదు వింటే ఆశ్చర్యపోతారు.. యువరాజ్‌, సుల్తాన్‌ అని పిలిచే ఈ దున్నపోతులు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు కోటాలో జరుగుతున్న ‘గ్లోబర్‌ రాజస్థాన్‌ అగ్రిటెక్‌ మీట్‌’లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. హరియాణాకు చెందిన ఇద్దరు రైతులు వీటి యజమానులు. ముర్రాజాతికి చెందిన ఈ దున్నపోతుల్లో యువరాజ్‌ గురించి ఇది వరకే తెలిసినా దీనికి పోటీగా ఇప్పుడు సుల్తాన్‌ వచ్చింది. మేలు జాతి పాడి గేదెల ఉత్పత్తికి ఉపయోగపడే ఈ దున్నపోతుల వీర్యానికి భారీ గిరాకి ఉంది. గత ఏడాది యువరాజ్‌ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు రాగా యజమాని కరంవీర్‌సింగ్‌ విక్రయించేందుకు సిద్ధపడలేదు.

సుల్తాన్‌కు ఏకంగా రూ.21 కోట్లు ఇస్తానని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యవసాయదారుడు ముచ్చటపడగా యజమాని నరేష్‌ బెనివాల్‌ తిరస్కరించారు. తమకు వాటితో విడదీయలేని అనుబంధం ఉందని, డబ్బుకు ఆశపడి వాటిని దూరం చేసుకోలేమని ఆ రైతులిద్దరూ తెలపటం గమనార్హం. సుల్తాన్‌ ఒక్కో తడవకు సుమారు 6మిల్లీలీటర్ల వీర్యాన్ని ఇస్తుందని, శాస్త్రీయ పద్దతుల్లో పలుచగా చేసి 600 డోసులు తయారు చేస్తున్నట్లు యజమాని నరేష్‌ తెలిపారు. ఒక్కో డోసును రూ.250 చొప్పున చెల్లించి పాడి గేదెల రైతులు కొనుగోలు చేస్తారన్నారు.

ఏడాదికి సుల్తాన్‌ 54వేల డోసులు, యువరాజ్‌ 45వేల డోసుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి రోజుకు ఆహారం 20లీటర్ల పాలతో పాటు ఆరోగ్యవంతమైన, బలవర్దకమైన దాణా తినిపిస్తారు. రోజుకు మూడు సార్లు స్నానం చేయిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here