చేతి వేలు ఊడింద‌ని..కాలి వేలు తీసేశారు!

ఓ యువ‌కుడు ప్ర‌మాద‌వ‌శాత్తు చేతి బొట‌న వేలును కోల్పోయాడు. ఆ వేలును తిరిగి అతికించ‌డానికి డాక్ట‌ర్లు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా నాలుగు చేతిలేళ్ల‌తో బ‌తికేద్దామ‌నుకుంటారు. కానీ, ఆ యువ‌కుడు త‌న కాలి బొట‌న వేలును చేతి బొట‌న వేలుగా శ‌స్త్రచికిత్స చేయించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అరుదైన శ‌స్త్ర చికిత్స ఆస్ట్రేలియాలో జ‌రిగింది.

పెర్త్‌కు చెందిన జాక్‌ మిచెల్‌(20) పశువుల కాపరి. అతడు పనిచేస్తున్న ఫౌంహౌస్‌లో  వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్‌ను ఢీకొట్టింది. గోడ‌కు, ఎద్దు కొమ్ముల‌కు మ‌ధ్య అత‌డి బొటన వేలు ఊడి కిందపడింది. మిచెల్‌ స్నేహితులు హుటాహుటిన అత‌డిని  ఆసుపత్రికి తరలించారు. ఊడిన వేలుని ఐస్‌ మధ్య భ‌ద్ర‌ప‌రిచి డాక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న ఏప్రిల్ లో జ‌రిగింది.

పెర్త్‌ డాక్టర్లు ఊడిపోయిన మిచెల్‌ వేలు అతికించడానికి శత విధాల ప్రయత్నించారు. రెండు సార్లు సర్జరీలు కూడా చేశారు. అయినా ఆ వేలు అతకపోవడంతో తదుపరి చికిత్సకు సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి డాక్టర్లు మిచెల్ కు ప్లాస్టిక్‌ సర్జరీ చేయాలని సూచించారు. అవసరమైతే కాలి బొటన వేలిని చేతికి అతికించాల్సి ఉంటుందని చెప్పారు. మొద‌ట కాలి బొట‌న వేలు తొల‌గించ‌డానికి త‌ట‌ప‌టాయించిన మిచెల్ చివ‌ర‌కు అంగీక‌రించాడు.

దీంతో, సిడ్నీ డాక్టర్లు రెండు వారాల క్రితం విజయవంతంగా అత‌డి కాలి బొట‌న వేలును తొల‌గించి చేతికి అతికించారు. చాలా మంది త‌మ శ‌రీరంలో బాగున్న భాగాన్ని తీసి మ‌రో చోట అతికించుకోవాల‌ని అనుకోర‌ని వైద్యులు అన్నారు. కానీ, మిచెల్ వెరైటీగా ఆలోచించాడ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం అత‌డు నాలుగు వేళ్ల‌తో కూడా బాగానే న‌డ‌వ‌గ‌లుగుతున్నాడ‌ని అత‌డి త‌ల్లి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here