85 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్.. రికవరీ రేటు 22.17 శాతం; 900 చేరువలో మరణాలు

భారత్‌లో గత 28 రోజుల్లో 16 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 14 రోజుల్లో 85 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది. గడచిన 24 గంటల్లో 1396 కొత్త కేసులు నమోదు కాగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,892కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఒక్క రోజులో 381 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ 6184 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 20,835 మంది ప్రస్తుతం హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. 872 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 22.17 శాతం ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా యాంటీబాడీలను సేకరించి.. కరోనా చికిత్సలో వాడొచ్చని కూడా తెలిపింది. కాబట్టి కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రజలకు సూచించింది.

హెల్త్ కేర్, శానిటరీ వర్కర్లు, పోలీసులను టార్గెట్ చేసుకొని దాడులు చేయొద్దని.. వారు మీకు సాయం చేయడానికే ఉన్నారని లవ్ అగర్వాల్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here