10.2 రోజులకు పడిపోయిన కరోనా డబులింగ్ రేటు .. మంగళవారం నుంచే పరిస్థితిలో మార్పు

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు సమయం గతవారం రోజులతో పోల్చితే గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల కిందట పాజిటివ్ కేసుల రెట్టింపునకు 12 రోజుల సమయం పడితే.. ప్రస్తుతం అది 10.2 కి తగ్గిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో మహమ్మారి వేగంగా పెరుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కేంద్రం పేర్కొంది. అయితే, రికవరీ రేటు మాత్రం పెరగడం కొంత సానుకూలం. మరణాలు రేటు 3.3 శాతంగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మంగళవారం నుంచి ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పాజిటివ్ కేసులు, మరణాలు ఆ రోజు నుంచే భారీగా నమోదవుతున్నాయి. అప్పటి వరకూ స్థిరంగా కొనసాగిన కేసుల రెట్టింపు సమయం.. ఒక్కసారిగా తగ్గిపోయింది. పశ్చిమ్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అంతరాలను సరిదిద్ధడంతోనే రెట్టింపు రేటు క్షీణతకు కారణమని తెలిపింది. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో మరణాలు రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. కోవిడ్-19పై సకాలంలో స్పందించి, క్లినికల్ మేనేజ్‌మెంట్ సమర్ధంగా నిర్వహించడం వల్లే మరణాలు రేటు తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మొత్తం కరోనా బాధితుల్లో కేవలం 1.1 శాతం మంది పరిస్థితి మాత్రమే విషమంగా ఉంటుందని, మరో 3.3 శాతం మందికి మెడికల్ ఆక్సిజన్, ఇంకో 4.8 శాతం మందికి ఐసీయూలో చికిత్స అవసరమవుతుందన్ని తెలిపారు. దేశంలో పరీక్షల సామర్థ్యం కూడా పెరిగింది. ఈవారం ప్రారంభంలో రోజుకు సగటున 75,000 పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం అది 95,000 చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న 327 ప్రభుత్వ, 118 ప్రయివేట్ ల్యాబొరేటరీలలో ఇప్పటి వరకూ 13.57 లక్షల నమూనాలను పరీక్షించారు.

గురవారం సాయంత్రానికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,952కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 1,783 మంది ప్రాణాలు కోల్పోగా.. , మరో 15,266 మంది కోలుకున్నారని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 3,561 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 1,084 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తం రికవరీ రేటు 28.8 శాతానికి చేరింది. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఆశించినట్లుగా వ్యాధి తీవ్రత క్రమంగా తిరోగమనానికి బదులు పెరుగుతోందని, ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని హర్ష్ వర్ధన్ అన్నారు.

ఇప్పటి వరకూ కేసులు నమోదుకాని జిల్లాలకు వ్యాధి రాకుండా నిరోధించడమే పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లోనూ, 130 రెడ్, 284 ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. ఏదేమైనా మరిన్ని జిల్లాల్లో కొత్త కేసులు నమోదుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడు నుంచి 13 రోజుల్లో 180 జిల్లాల్లో, గత 14 నుంచి 20 రోజుల మధ్య 164 జిల్లాల్లో, 28 రోజుల నుంచి 136 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదుకాలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here