సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. లాక్‌డౌన్ పొడిగిస్తారా?

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తీరు గురించి ఈ సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి గడువు మే 3తో ముగియనున్న నేపథ్యంలో.. ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి సీఎంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మార్చి 22న సమావేశమైన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు.

ఏప్రిల్ 14న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తాజా భేటీలో కరోనాను కట్టడి చేస్తూనే దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎలా ఉపసంహరించాలనే విషయమమై ప్రధాని మోదీ, సీఎంల మధ్య చర్చ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆదివారం మన్ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం దేశం యుద్ధం మధ్యలో ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

కేసీఆర్, జగన్‌తోపాటు 17 రాష్ట్రాల సీఎంలు ఈ భేటీలో పాల్గొనగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేరళ చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కాగా.. ఆ రాష్ట్రం సూచనలను లేఖ ద్వారా అందించారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 28 వేలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 872కు చేరింది. మహారాష్ట్రలో 440 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 వేలు దాటింది. కోవిడ్ కారణంగా ఈ రాష్ట్రంలో 342 మంది చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here