సికింద్రాబాద్‌లో యువకుడి ఆత్మహత్య.. ప్రకాశం జిల్లాలో విషాదం

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సామాన్యులకు ఆర్థిక సమస్యలు ఎక్కువవున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. చేసేందుకు పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబం అప్పుల పాలవడం.. లాక్‌డౌన్‌తో చేతిలో డబ్బుల్లేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా మండలం గాలిజెరుగుల్ల గ్రామానికి చెందిన దేశబోయిన నారాయణ(22) గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆర్పీఎఫ్‌లో హోంగార్డుగా పని చేస్తున్న మేనమామ ప్రసాద్‌తో కలసి చిలకలగూడలో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌తో రూమ్‌కే పరిమితమైన నారాయణ మానసికంగా కుంగిపోయాడు. ప్రసాద్ డ్యూటీకి వెళ్లిన తరువాత రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read:

డ్యూటీలో ఉన్న ప్రసాద్ మేనల్లుడు నారాయణకి పలుమార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తన స్నేహితుడిని రూమ్ వద్దకు పంపాడు. ప్రసాద్ స్నేహితుడు వచ్చి తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులుబద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా నారాయణ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. నారాయణ ఎప్పుడూ తన తండ్రి కాలు విరిగిందని.. అప్పులు బాగా పెరిగిపోయాయని మదనపడుతుండేవాడని ప్రసాద్ చెప్పాడు. లాక్‌డౌన్ కారణంగా డబ్బులు కూడా లేవని బాధపడేవాడని పోలీసులకు తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని మేనమామ చెప్పిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here