దేశీయ టెస్టింగ్ కిట్‌కు సత్యజిత్ రే కల్పిత డిటెక్టివ్ పేరు.. టాటా సన్స్‌‌తో కీలక ఒప్పందం!

దేశంలో మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌లు, ట్రూనాట్, పీసీఆర్ యంత్రాలను వినియోగించనుంది. టెస్టింగ్ కిట్‌లను దేశీయంగా తయారుచేసిన ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ఐఆర్)కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) కోవిడ్ -19 కోసం పేపర్ ఆధారిత టెస్ట్ స్ట్రిప్‌ను అభివృద్ధి చేసింది. ఈ కిట్‌కి సత్యజిత్ రే సృష్టించిన కల్పిత డిటెక్టివ్ పేరు ‘’గా నామకరణం చేశారు. పెద్ద సంఖ్యలో ఈ కిట్‌లను తయారీకి టాటా సన్స్‌తో ఐజీఐబీ చేతులు కలిపింది.

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫెలూడా.. పేపర్ ఆధారిత స్ట్రిప్ టెస్ట్. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా సామూహిక పరీక్షలను నిర్వహించడానికి ‘ఫెలుడా’ రూపొందించారు. అధిక ఖర్చుతో కూడుకున్న క్యూ-పీసీఆర్ యంత్రాలపై అధారపడుతుండగా, ఫెలూడా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనాలు అందజేస్తుంది.

విజ్ఞాన శాస్త్రంపై లోతైన పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించే ఐజీఐబీ.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంది. కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ఎదుర్కోవడానికి బలమైన భాగస్వామితో కలిసి పనిచేయడం సీఎస్ఐఆర్ ముఖ్య లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మాండే వ్యాఖ్యానించారు.

వేగవంతమైన, ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం కిట్ అభివృద్ధికి సంబంధించి సీఎస్ఐఆర్-ఐజీఐబీ, టాట్ సన్స్ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించే కిట్‌ల తయారీలో సీఎస్ఐఆర్‌కి చెందిన ఐజీఐబీతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని టాటా సన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్, ఏరోస్పేస్ విభాగం ప్రెసిడెంట్ బన్‌మాలీ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇతర కిట్‌లతో పోల్చితే తక్కువ సమయంలో ఫలితాలు అందజేస్తుందని, దీనిని నిర్వహించడం, అవగాహన చేసుకోవడం చాలా సులభమని, వైద్యులకు అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.

సాధారణంగా రియల్‌ టైం రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్ ‌- పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్ ‌(ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షల్లో ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మారుస్తారు. సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఫెలూడా కూడా ఈ ప్రక్రియ ద్వారానే ప్రారంభమవుతుంది. త‌ర్వాత‌ ప్రత్యేకంగా రూపొందించిన పీసీఆర్‌ రియాక్షన్‌ ద్వారా వైరల్‌ న్యూక్లిక్‌ యాసిడ్ సీక్వెన్స్‌ వృద్ధి చెందుతుంది. అనంత‌రం ఎఫ్‌ఎన్‌సీఏఎస్‌9 అనే ప్రొటీన్ ఆ సీక్వెన్స్‌కు అతుక్కుంటుంది. ఇలా ఏర్ప‌డిన బంధాన్ని గర్భనిర్ధారణ పరీక్షల తరహాలోనే పేపర్‌ స్ట్రిప్‌పై గుర్తించవచ్చు. కేవలం గంట వ్యవధిలో ఈ పరీక్ష పూర్తవుతుంది. పైగా ఈ ప్రక్రియలో ఖరీదైన రియల్ టైమ్‌ పీసీఆర్‌ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here