తెలంగాణలో దారుణం.. తాగడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య

తెలంగాణలో దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో… ఒక్కసారిగా మందుబాబులంతా వైన్ షాపులకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలోనే మద్యంలేక ఇన్నాళ్లు ఆగిన వారంతా ఇప్పుడు ఎలాగో ఓ లా తాగాలని దారుణాలకు పాల్పడుతున్నారు. మద్యం షాపులు తెరుచుకోవడంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్లి తాగుడు కోసం తగలేస్తున్నారు. అసలే లాక్ డౌన్‌తో చాలామందికి ఉపాధి లేకుండా పోయింది. నెల జీతగాళ్లకు కూడా సగం శాలరీయే చేతికొచ్చింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా తల్లినే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం దుద్యాల గ్రామంలో జరిగింది.

కుటుంబ సభ్యులు, గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం గడ్డం అంజిలమ్మ(64) ఏకైక కుమారుడు అశోక్‌. గత కొంత కాలంగా జూదం, మద్యానికి బానిసయ్యాడు. వారం రోజుల క్రితం వరకు జూదంలో రూ.60 వేల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. అప్పటికే తల్లి దగ్గర వెండి అభరణాలు తీసుకువెళ్లి అమ్ముకున్నాడు. ఈ నేపథ్యంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ అశోక్‌ గురువారం రాత్రి తల్లితో గొడవ పడ్డాడు. డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here