ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్ వీడియోలు.. షాక్‌కు గురైన స్పీకర్

ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాల గురించి ప్రజా ప్రతినిధులు ద్వారా చర్చలు జరుపుతుండగా అనుకోని అవాంతరం ఎదురైంది. ఏకంగా కంప్యూటర్ స్క్రీన్లపై చిత్రాలు కనిపించాయి. సీరియస్‌గా జరుగుతున్న సమావేశంలో ఉన్నట్టుండి నీలి చిత్రాలు ప్రత్యక్షం కావడం పట్ల అందరూ కంగుతిన్నారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.

ద‌క్షిణాఫ్రికాలోని పార్లమెంటు ప్రజాప్రతినిధుల వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పోర్న్ వీడియోలు కనిపించడం పెద్ద దుమారం రేగుతోంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌ డౌన్‌ను ఆదేశంలో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు సభ్యులు నేరుగా సమావేశం కాకుండా వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరుపుతున్నారు. జాతీయ అసెంబ్లీ స్పీక‌ర్, ఛైర్ ఉమెన్ అయిన థండీ మోడిసే వ‌ర్చువ‌ల్ స‌మావేశాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం జూమ్ వీడియో కాలింగ్ ద్వారా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

వివిధ అంశాలపై చర్చలు జరుగుతుండగా అక‌స్మాత్తుగా వీడియోకాన్ఫరెన్స్ తెరపై అశ్లీల వీడియోలు వచ్చేశాయి. దీంతో స్పీక‌ర్ సహా సమావేశంలో ఉన్న సభ్యులంతా షాక‌య్యారు. అయితే, ఈ పనిని హ్యాకర్లు చేసినట్లుగా గుర్తించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను హ్యాక్ చేసిన వారు స్పీక‌ర్‌పై అసభ్య వ్యాఖ్యలు కూడా చేశారు.

జూమ్ ద్వారా జ‌రుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్సులో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఆ ప్లాట్‌ఫాం ద్వారా మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించవద్దని గతంలో స్పీకర్ ఆదేశాలు జారీ చేసినా సాంకేతిక సిబ్బంది అందులోనే వీసీ నిర్వహించడంపై థండీ మోడిసే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటు స‌భ్యులు మ‌రో లింక్‌ ద్వారా తమ సమావేశాలను కొనసాగించారు.

జూమ్ సంస్థపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మీటింగ్‌లకు అంతరాయం కల్పించి అసభ్య కంటెంట్‌ను చొప్పిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొద్ది రోజుల క్రితమే భారత ప్రభుత్వం కూడా ఈ మాధ్యమం ద్వారా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించవద్దని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here