సెక్స్‌తో కరోనా వ్యాపిస్తుందా? అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!

గతేడాది డిసెంబరులో వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కొత్తరకం వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. కరోనా బాధితుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శృంగారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందా? అనే అంశంపై అధ్యయనాలు సాగుతున్నాయి. తాజాగా చైనా పరిశోధకులు దీనిపై అధ్యయనం నిర్వహించి నివేదిక విడుదల చేశారు.

వైరస్ నిర్ధారణ అయినవారి వీర్యంలో కరోనా వైరస్‌ ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు.. దీని వల్ల వ్యాధి వ్యాపిస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. షాంగిక్యూ మున్సిపల్‌ ఆస్పత్రిలోని 38 మంది బాధితులపై అధ్యయనం నిర్వహించి, రూపొందించిన నివేదికను జామా నెట్‌వర్క్ వెల్లడించింది. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఇద్దరు కోలుకోగా, మరో నలుగురు వైరస్ బాధపడుతున్నారు.

బాధితుల వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం మాత్రం తెలియరాలేదు. అలాగే సెక్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? లేదా? అన్న దానిపై కూడా పరిశోధకులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. గత నెలలో 34 మందిపై అధ్యయనం నిర్వహించి, జర్నల్‌ ఫెర్టిలిటీ అండ్‌ స్టెరిలిటీ ప్రచురించిన దానితో పోలిస్తే, వ్యత్యాసం కనపడుతోంది.

కరోనా నుంచి ఎనిమిది రోజుల కిందట కోలుకున్నవారు సహా మూడు నెలల పూర్తి చేసుకున్న బాధితుల నుంచి వీర్యం సేకరించి అమెరికా, చైనా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. వీరి వీర్యంలోనూ కరోనా వైరస్‌ను గుర్తించలేదు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మరికొంత మందిపై పరిశోధన చేస్తున్నట్లు ఉతాహ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్‌ జాన్‌ హోట్లింగ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ ప్రధానంగా బాధితులు దగ్గినా, తుమ్మినా వ్యాపిస్తుందని, అదే విధంగా రక్తం, కన్నీళ్ల ద్వారా కూడా కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతుందని వివరించారు.

శృంగారం ద్వారా కరోనా వ్యాపిస్తుందా? అన్న అంశంపై మరిన్ని పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ హోట్లింగ్‌ వ్యాఖ్యానించారు. సెక్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందడం లేదని ధీమాగా ఉండటం కంటే, ముందు జాగ్రత్తగా ఉండటమే మేలని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రీప్రొడెక్టివ్‌ మెడిసన్‌ తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాదు, అనుమానం ఉంటే 14 రోజుల వరకూ సెక్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్‌ పీటర్‌ హెగెల్‌ సూచిస్తున్నారు. ఎబోలా, జికా లాంటి ఇతర వైరస్‌లు సెక్స్ ద్వారా వ్యాపించే విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here