వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని.. పుట్టిన బిడ్డకు వారి పేరు!

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భార్య క్యారీ సీమండ్స్ నాలుగు రోజుల కిందట ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బిడ్డ పుట్టడానికి కొన్ని వారాల ముందే కరోనా వైరస్ బారినపడి మృత్యువు అంచులు దాకా వెళ్లిన బ్రిటన్ ప్రధాని చికిత్స అనంతరం కోలుకున్నారు. దీంతో తన ప్రాణాలు కాపాడిన వైద్యుల పేరును తన కుమారుడికి పెట్టి వారి రుణం తీర్చుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా శనివారం వెల్లడించారు. కరోనాకు చికిత్స చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేసినట్టు తెలిపారు.

ప్రాణంపోసిన వైద్యుల పేరును తమ కుమారుడికి పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీమండ్స్ తాత లౌరీ.. బోరిస్ తాత విల్‌ఫ్రెడ్.. జాన్సన్‌కు వైద్యం చేసి డాక్టర్లు నిక్ ప్రైస్, నిక్ హర్ట్.. ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు. ‘తనను చాలా బాగా చూసుకున్న జాతీయ ఆరోగ్య వ్యవస్థ ప్రసూతి బృందానికి ధన్యవాదాలు.. సంతోషంతో నా గుండె నిండింది’ అని ప్రధాని భార్య తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పెట్టారు.

మార్చి చివరివారంలో బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా ఆయన ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకున్నారు. అయినా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఏప్రిల్ 7న హాస్పిటల్‌కు తరలించారు. వైరస్ తీవ్రత పెరగడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. వారం రోజుల తర్వాత ఆయన కోలుకోవడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయ‌న అన్నారు. వారి సేవ‌ల‌కు కేవ‌లం థ్యాంక్స్ మాత్రమే స‌రిపోద‌ని, ఆస్ప‌త్రి సిబ్బందే త‌న ప్రాణాల‌ను కాపాడార‌ని అన్నారు. అన్నట్టుగా థ్యాంక్స్‌తోనే ఆగిపోకుండా తన బిడ్డకు వైద్యుల పేరునే పెట్టి రుణం తీర్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here