వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేసినా బయటకు రాని ప్రజలు.. ఇంకా భయం భయంగానే!

కరోనా వైరస్‌కు మూల కేంద్రం చైనాలోని వుహాన్‌‌లో 76 రోజుల అనంతరం ఏప్రిల్ 8న లాక్‌డౌన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ నగరవాసులు స్వేచ్ఛగా బయట తిరగలేకపోతున్నారని అక్కడి భారతీయులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు బయటపడనప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలుతున్న వ్యక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటమే కారణమని వివరించారు. మహమ్మారి మరోసారి పంజా విసరడానికి ఇలాంటి కేసులు కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసులు, నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే జనం బయటకు వస్తున్నారని.. మిగతా సమయాల్లో ఇళ్లకే పరిమితమవుతున్నారని తెలిపారు.

విజృంభించడంతో ఫిబ్రవరిలో అక్కడ నుంచి 600 మందికిపైగా భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. మరి కొందరు మాత్రం వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాలతో అక్కడే ఉండిపోయారు. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ 8న నగరంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితుల గురించి పీటీఐతో మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో జనం బయటకు వస్తున్నారు. అయితే అత్యవసర పనులు, నిత్యాసరాల కొనుగోలు కోసం మాత్రమే. అసింప్టమాటిక్‌ కేసుల భయంతో అత్యధిక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు’ అక్కడ ఉన్న భారతీయ పరిశోధకుడు పేర్కొన్నారు.

‘అసింప్టమాటిక్‌ కేసుల కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బయటకు వెళ్తే మనకు ఎవరు ఎదురుపడతారో తెలియదు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో చెప్పలేం. అందుకే పనులు ముగించుకున్న వెంటనే జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంకెక్కడా తిరగట్లేదు’’ అని మరొకరు వివరించారు.

భారత్‌లోనూ కరోనా విస్తరిస్తున్నందున తమ కుటుంబసభ్యుల గురించి ఆందోళన చెందుతున్నామని మరో వ్యక్తి అన్నారు. ‘జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నా పరిస్థితి గురించి భారత్‌లో నా కుటుంబం బాధపడింది. ఇప్పుడు వారి గురించి నేను ఆందోళన చెందుతున్నా. భారత్‌లో వైరస్‌ వ్యాప్తి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాం’ అని వివరించారు.

వుహాన్‌లో పరిస్థితులు మెరుగుపడినా… భౌతిక దూరం, పరిశుభ్రత ఇతర ప్రమాణాలను ప్రజలు ఇప్పటికీ పాటిస్తున్నారని మరో భారతీయ పరిశోధకుడు తెలియజేశారు. కరోనా బాధితులను, ముఖ్యంగా అసింప్టమాటిక్‌ కేసులను గుర్తించేందుకు న్యూక్లిక్‌ యాసిడ్ టెస్ట్‌లను అధికారులు ముమ్మరం చేశారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. గతవారం రోజులుగా వుహాన్ నగరంలో ఎలాంటి కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదు కాలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అయితే, చైనాలో సోమవారం మరో 40 మందికి అసింప్టమాటిక్ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇలాంటి కేసుల సంఖ్య చైనాలో 997కి చేరాయి. వీరిలో 130 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వుహాన్ నగరంలో 599 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వుహాన్‌లో ఇప్పటివరకు 50,333 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 3,869 మంది మరణించారు. అక్కడి ఆస్పత్రుల్లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య సున్నాకు చేరినట్టు అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here