వధూవరులకు కరోనా… గ్రామం మొత్తానికి సీల్

కొత్తగా పెళ్లైన జంటకు కరోనా షాకిచ్చింది. పెళ్లి చేసుకున్న వధూవరూలిద్దరికీ కరోనా తాజా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురితో పాటు… కుటుంబసభ్యులు అందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. నూతన వధూవరులను రాజస్థాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ వివాహానికి వేదికగా నిలిచిన అజంఘడ్‌లోని చత్తర్‌పూర్ గ్రామానికి అధికారులు సీల్ వేశారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఉత్తర ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ యువతిని మార్చి 23న వివాహమాడాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో పెళ్లివారు అదే గ్రామంలో చిక్కుకుపోయారు. అయితే ఏప్రిల్ 14న చత్తర్ పూర్ నుంచి అమ్మాయిని తీసుకొని రాజస్థాన్‌కు పయనమయ్యారు. నాలుగు రోజులు ప్రయాణి తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ సరిహద్దుకు చేరుకున్నారు.

అయితే సరిహద్దు సిబ్బంది వారిని అక్కడే ఆపేసి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి జరిగిన చత్తర్‌పూర్ గ్రామాన్ని మూసివేశారు. వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు తరలించారు. గ్రామస్థులకు స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజింగ్ చేయనున్నారు. అటు యూపీలో ఇప్పటివరకు 1700కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 29 మంది మరణించారు. ఇటు రాజస్థాన్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 2152 కేసులు నమోదు అయ్యాయి. 26 మంది వైరస్ బారిన పడి మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here