మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు.. సీఎం ఉద్ధవ్ సంకేతాలు

మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగడంతో లాక్‌డౌన్‌ను మే చివరి వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రతిపక్షాలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ఉద్ధవ్.. వారి సూచనలు, సలహాలను స్వీకరించారు. వైరస్‌‌ను సమర్ధంగా కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపక్షాలతో చర్చించారు. బీజేపీ తరఫున మాజీ సీఎం దేవేందర్ ఫడణ్‌వీస్, ఆ పార్టీ శాసన మండలి నేత ప్రవీణ్ దరేకర్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, వంచిత్ బహూజన్ అఘాడీ నేత ప్రకాశ్ అంబేడ్కర్ తదితరులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ను రెడ్ జోన్‌లో ముఖ్యంగా ముంబయి, పుణేలో కొనసాగించాలని సీఎం భావిస్తున్నారని ప్రతిపక్ష నేతలు సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబయిలో ఎస్‌ఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. వలస కార్మికులు సహా అధికార యంత్రాంగం సమన్వయ లోపం వల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయని, మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారు. సియాన్ హాస్పిటల్‌లో కోవిడ్-19తో చనిపోయినవారి మృతదేహాలను తరలించడం లేదని, దీని వల్ల కొత్తగా వైరస్ నిర్ధారణ అయిన బాధితులు చేరడానికి ఇబ్బందిగా ఉందని దేవేందర్ ఫడణ్‌వీస్ అన్నారు.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 1,323 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటింది. ఒక్క ముంబయి నగరంలోనే బాధితుల సంఖ్య 11,300 దాటింది. ముంబయిలో ఆర్థర్‌ రోడ్‌ జైలులో 72 మంది ఖైదీలు, ఏడుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఖైదీలను ముంబయిలోని జీటీ ఆసుపత్రి, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రులకు తరలించారు. జైల్లోని వంట మనిషి ద్వారా వీరికి కరోనా సోకినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here