బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం.. ‘ఎంఫాన్’ తుఫాన్‌గా మారే అవకాశం

దక్షిణ అండమాన్‌ సముద్రం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం వరకు నిలకడగా కొనసాగుతోంది. వాతవరణ స్థితిలో ఎలాంటి మార్పులేదు. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీకి ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని వాతావరణ విభాగం అధికారులు స్పష్టం చేశారు. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ అల్పపీడనం బలపడటం లేదని.. అందుకే ఏపీకి తుఫాన్ ముప్పు తప్పిందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎంజేఓ ఇప్పటికే హిందూ మహాసముద్రం నుంచి దూరమైనందున అల్పపీడనం బలహీనపడింది. రాబోయే మూడు రోజుల్లో కూడా ఇది మరింత బలపడే సూచనలు కూడాలేవని పేర్కొంది. పరిస్థితుల్లో కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉందని, అందువల్ల ఈ ప్రాంతం వచ్చే నాలుగు రోజులు పరిశీలనలో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

వాస్తవానికి మే 8 నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని అంచనా వేశారు. ఈ తుఫాన్‌కి ఎంఫాన్‌ అని నామకరణం చేశారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మే 13 నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, ఓడిశా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మే 13 నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here