ప్రపంచవ్యాప్తంగా 2.34 లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి

చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడిస్తోంది. ఈ రాకాసి కోరల్లో చిక్కుకుని అందరూ విలవిలలాడుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో మృత్యుతాండవం కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 33 లక్షలు దాటింది. ఇందులో 2.34 లక్షల మంది మృతిచెందగా.. ఇప్పటి వరకూ 10.42 లక్షల మంది కోలుకున్నారు. మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిపై పోరులో కీలక మైలురాయి ఇది.

అయితే, మరో 20 లక్షల మందిలో వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండగా.. 50 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్యలో ఇది దాదాపుగా మూడో వంతు కావడం విశేషం. సామాజిక దూరం వంటి ప్రమాణాలను పక్కాగా అమలు చేస్తున్న పలు దేశాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. అక్కడ వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రెండు రోజులపాటు అక్కడ మహమ్మారి కాస్త శాంతించినట్లు కనిపించినా.. మళ్లీ విజృంభించింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,502 మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 63,861కి చేరింది. అలాగే, బాధితుల సంఖ్య 11లక్షలకు చేరువలో ఉంది.

న్యూయార్క్‌ నగర సమీపంలోని బ్రూక్లిన్‌లో అంత్యక్రియలు నిర్వహించే ఓ కేంద్రం బయట నిలిపి ఉంచిన రెండు ట్రక్కులు, ఓ వ్యాను నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా.. వాహనాల్లో 50కి పైగా మృతదేహాలు కనిపించాయి. రిఫ్రిజిరేషన్‌ సదుపాయం లేకపోవడంతో అవన్నీ కుళ్లిపోయాయి. కరోనా తీవ్రతతో అంత్యక్రియల కేంద్రానికి రోజూ వందలకొద్దీ మృతదేహాలు వస్తున్నాయని.. వాటిని భద్రపర్చేందుకు తగిన సదుపాయాలు అక్కడ లేవని అధికారులు తెలిపారు. ట్రక్కుల్లోనే ఉంచడంతో మృతదేహాలు కుళ్లిపోయాయని వివరించారు.

గురువారం బ్రిటన్‌లో మరో 700కిపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 268,771కి పెరిగింది. బ్రిటన్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 177గా నమోదయ్యింది. గత రెండు నెలల నుంచి కరోనా ధాటికి చిగురుటాకులా వణికిన ఇటలీ, స్పెయిన్‌లో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. కొత్త కేసులు, మరణాల సంఖ్య కూడా ఆ దేశాల్లో తగ్గడంతో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించేందుకు ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి.

ఇటలీలో 27,967, స్పెయిన్‌లో 24,543, ఫ్రాన్స్‌లో 24,376, బెల్జియంలో 7,590, జర్మనీలో 6,623 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 239,639, ఇటలీలో 205,463, ఫ్రాన్స్‌లో 167,178, జర్మనీలో 163,009 మంది వైరస్ బారినపడ్డారు.

రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటగా.. మరణాల సంఖ్య మాత్రం వందల్లోనే ఉంది. కరోనా మహమ్మారి రష్యా ప్రధాన మంత్రిని సైతం వదల్లేదు. తనకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లుగా ఆ దేశ ప్రధాని మైఖైల్ మిషుస్తిన్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వీడియో కాల్‌లో చెప్పినట్లుగా ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రధానికి కరోనా సోకినందున ఆయనకు నయం అయ్యే వరకూ ఆ బాధ్యతలన్నీ ఇకపై ఉప ప్రధాని అయిన ఆండ్రూయ్ బెలూసోవ్ నిర్వర్తించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here