దేశంలో కరోనా.. 35వేలు దాటిన పాజిటివ్ కేసులు

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌తో 1,147 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటగా.. అక్కడ 459 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోనే 7వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారవీలో గురువారం మరో 36 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసుల సంఖ్య 359కి చేరింది. ముంబయి నగరంలో మొత్తం 290 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత పెద్ద సంఖ్యలో గుజరాత్‌లోనే పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 4,395 మందికి వైరస్ సోకగా.. 214 మంది చనిపోయారు.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. గురువారం మరో 22 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1038కి పెరిగింది. ఈ మహమ్మారికి రాష్ట్రంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. గురువారం 33 మంది కోలుకొని గాంధీ నుంచి ఇళ్లకెళ్లారు. ఇందులో 50 ఏళ్ల వయసున్న వైద్యుడు కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 10 రోజుల్లో కరోనా కేసుల ఉద్ధృతి పెరిగింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొత్తగా 71 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,403కు చేరింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతోంది. తదనుగుణంగా కేసుల విస్తృతీ ఎక్కువవుతోంది. ఏప్రిల్‌ 20 ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కేసులు 722. గడిచిన పది రోజుల్లోనే ఈ సంఖ్య 1,403కు చేరింది.

ఢిల్లీలో 3,515 మందికి వైరస్ సోకగా.. 59 మంది ప్రాణాలు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 2,635కి చేరగా.. 136 మంది చనిపోయారు. రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నారు. తమిళనాడులో గురువారం 161 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,323కు చేరింది. రాజధాని చెన్నై కరోనా ధాటికి విలవిలలాడుతోంది. కొత్తగా 138 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. నగరంలో మూడు రోజులుగా 103, 94, 138 పాజిటివ్‌ కేసులు రావడం ఇక్కడ వైరస్‌ ఉద్ధృతికి నిదర్శనం. తాజా కేసులతో చెన్నైలో కరోనా సోకినవారి సంఖ్య 906కు చేరింది.

కర్ణాటకలో మరో 30 కరోనా కేసులు వెలుగుచూశాయి. దక్షిణ కన్నడ జిల్లాలో కరోనాతో చికిత్స పొందుతున్న 63 ఏళ్ల వృద్ధురాలు గురువారం మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 565కు చేరగా 229 మంది కోలుకున్నారు. గత పదిహేను రోజులతో పోల్చితే కోలుకుంటున్నవారి శాతం పెరగడం శుభపరిణామం. గురువారం నాటికి కోలుకున్న బాధితుల శాతం 25.19గా నమోదయ్యింది. ఇదే రెండు వారాల కిందట 13.06 శాతంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here