ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్.. కేరళ సీఎం విజయన్ గైర్హాజరు

కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపు, ఆంక్షల దశలవారీగా సడలింపు, ఆర్ధిక వ్యవస్థ పునఃప్రారంభం తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా… కేరళ సీఎం పినరయ్ విజయన్ మాత్రం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. వైరస్ కట్టిడికి చర్యలు, లాక్‌డౌన్ అమలుపై కేరళ లిఖితపూర్వకంగా సూచనలు చేసింది.

వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళనిసామి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో సమావేశానికి హాజరయ్యారు.

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రిస్తూ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ ‘కనిష్ఠ చలనం… గరిష్ఠ పని’ అన్న నినాదంతో ముందుకు సాగాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రణాళిక గురించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ అభిప్రాయల ఆధారంగా తదుపరి కార్యాచరణ కేంద్రం ఖరారు చేయనుంది. దశల వారీగా ఆంక్షలను సడలించాలని భావిస్తున్న కేంద్రం.. ఈ విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వనుంది. లాక్‌డౌన్ తర్వాత ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం కావడం ఇది నాలుగోసారి. ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లు లాక్‌డౌన్ పొడిగింపునకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here