పిల్లులకు కరోనా వైరస్.. వాటి నుంచి మనుషులకు సోకుతుందా?

ప్ర పంచ దేశాలను కలవర పెడుతున్న కరోనా వైరస్ పిల్లులకు కూడా సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అమెరికాలో పెంపుడు జంతువులకు కరోనా సోకిన తొలి కేసు ఇదేనని వెల్లడించారు. కుటుంబసభ్యులు లేదా పరిసర ప్రాంత ప్రజల నుంచి పిల్లులకు ఈ వైరస్ సోకి ఉండవచ్చని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది.

కరోనా విళయతాండవం చేస్తున్న న్యూయార్క్‌లో ఇప్పటికే రెండు పులులు, మూడు సింహాలకు వైరస్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా పెంపుడు పిల్లులకు కూడా కరోనా సోకడం గమనార్హం. మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకిన ఘటనలు ప్రపంచంలోని పలు చోట్ల వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. మనుషుల నుంచి ఈ వైరస్ జంతువులకు సోకినా.. జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు ఎక్కడా ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.

కరోనా సోకిన పిల్లులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటికి ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. నదియా దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. జూలో పనిచేసే సిబ్బంది ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు భావించారు.

నదియాతో పాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు పరీక్షలు నిర్వహించారు. మరో పులికి, మూడు సింహాలకు వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్ సోకడంతో పులులు, సింహాలు ఆహారం తీసుకోవడం బాగా తగ్గించాయని జూ సిబ్బంది తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here