పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ సంచలన నిర్ణయం

దా యాది దేశం పాకిస్థాన్ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. ఆ దిశగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇక మీదట పీవోకే ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న పాక్ ప్రభుత్వానికి ఇది గట్టి హెచ్చరిక లాంటిదే.

ఐఎండీ ఇంతకుముందు ముజఫరాబాద్‌, గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు చేసేది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు నిలిపివేసింది. తాజాగా ఈ ప్రాంతాల్లో వాతావరణ సూచనలు చేయాలని నిర్ణయించింది. పీవోకే భారత్‌లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం బలంగా సంకేతాలిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Don’t Miss:

జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) ఆధ్వర్యంలో ముజఫరాబాద్‌, గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోనూ వాతావరణ మార్పులకు సంబంధించి సూచనలు జారీ చేయనున్నట్లు ఆర్‌ఎండీ హెడ్ కుల్‌దీప్‌ శ్రీవాత్సవ గురువారం (మే 7) తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్ ఎమ్ మహపాత్ర కూడా చెప్పారు. ఇకపై ఆ ప్రాంతాలను జమ్మూ-కశ్మీర్‌ సబ్‌ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలు భారత దేశంలో భాగమని.. వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని హెచ్చరించింది. ఈ విషయాన్ని పాక్‌కు మరింత స్పష్టంగా చెప్పే ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆది నుంచి అదే దూకుడు..

2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ.. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్.. పాక్‌తో పాటు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఆ తర్వాత పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మరోసారి చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్ పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి. భారత్‌ దూకుడు పెంచిందని.. యుద్ధమే చేయాల్సి వస్తే ఎదుర్కోవడం కష్టమేనని పాక్‌కు అర్థమయ్యేలా చేశాయి. ప్రపంచపటంలో పాక్‌ను లేకుండా చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. భారత్‌తో గిల్లిగజ్జాలు పెట్టుకుంటే ఆర్థికంగానూ తమకు తీవ్రంగా నష్టమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పటికే అర్థమైంది.

Watch:

గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ విషయంలో మోదీ ప్రభుత్వం మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కశ్మీర్‌కు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత పార్లమెంట్ చట్టం చేసింది. దీంతో పాటు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఇవన్నీ పాక్‌ను ఇరుకున పెడుతూ తీసుకున్న నిర్ణయాలే. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను చేజిక్కించుకోవడమే మిగిలిందని బీజేపీ నేతలు తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలను నిజం చేస్తూ మోదీ ప్రభుత్వం మరింత దూకుడు పెంచినట్లు సంకేతాలు అందుతున్నాయి. కరోనా కష్టకాలంలో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిన వేళ ఇందుకు ఇదే సరైన సమయమని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here