పలు రాష్ట్రాల్లో మొదలైన ప్లాస్మా థెరపీ.. తెలంగాణలో సిద్ధంగా ఉన్న 100 మంది దాతలు

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఒకరిద్దరు బాధితులకు పాస్ల్మా చికిత్స ట్రయల్స్ ప్రారంభించాయి. అలాగే, వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది సహా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులు, వారితో కాంటాక్ట్‌ అయిన వ్యక్తులకు ఔషధాలను పలు రాష్ట్రాలు అందజేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రం కరోనా బాధితులకు విషయంలో ఐసీఎంఆర్ ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. మహారాష్ట్రలో వారం రోజులుగా ఒక్క బాధితుడికి మాత్రమే ప్లాస్మా చికిత్స చేస్తున్నారు. ఇక్కడ ఆరోగ్య సిబ్బంది, బాధితులు అందరికీ హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలనే చికిత్సలో వాడుతున్నారు.

గత 15 రోజుల్లో ఏడు లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్స్‌కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని పలు హాస్పిటల్స్‌కు అందజేయనున్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అన్నారు. ప్లాస్మా చికిత్సలో కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని ప్రస్తుతం వైరస్‌తో బాధపడుతున్నవారికి ఎక్కిస్తారు. వ్యాధి నుంచి కోలుకున్నవారిలో యాంటీ బాడీలు వృద్ధిచెందుతాయి. దీంతో ఈ యాంటీ బాడీలు మరో వ్యక్తి రక్తంలోకి ప్రవేశిస్తే వైరస్‌ను నాశనం చేస్తాయి.

ఇండోర్‌లో రెండు రోజుల కిందట ముగ్గురు బాధితులకు ప్లాస్మా చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఓ పోలీస్‌కు బుధవారం ప్లాస్మా చికిత్సను ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని ప్రయివేట్ హాస్పిటల్స్‌లోనూ ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఆదివారం ఓ బాధితుడికి చికిత్స ప్రారంభించగా.. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని వైద్యులు తెలిపారు. అటు, ప్రయివేట్ హాస్పిటల్స్‌లో ప్లాస్మా చికిత్సకు పంజాబ్ ప్రభుత్వం అనుమతించింది. ఇటీవల కరోనాతో మరణించిన లూధియానా ఏసీపీ అనిల్ కోహ్లీకి సైతం ఈ చికిత్స చేశారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు వారంలో ఒకరోజు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవాలని సూచించింది.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ప్లాస్మా చికిత్సకు అనుమతి లభించినా, ఇంత వరకూ మొదలుపెట్టలేదు. అయితే, కర్ణాటకలో మాత్రం కరోనాను కోలుకున్న ఇద్దరు బాధితుల నుంచి ప్లాస్మాను సేకరించారు. ప్రస్తుతం ఐసీయూల్లో ఉన్న ఏడుగురికి చికిత్సను త్వరలో ప్రారంభించనున్నారు. ప్లాస్మా చికిత్సలో వెంటిలేటర్ మద్దతు, తక్కువ ఆక్సిజన్ అవసరమని వైద్యులు తెలిపారు. దాదాపు 100 మంది దాతలు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ తెలిపింది. ఏప్రిల్ 17 నుంచి కర్ణాటకలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను వాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here