నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం.. ఎయిమ్స్ వర్గాల వెల్లడి

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ (87) ఆదివారం రాత్రి అస్వస్థతతో ఢిల్లీలో ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వర్గాలు సోమవారం ఉదయం తెలిపాయి. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నాయి. కార్డియో-థైరాసిస్ వార్డులో మన్మోహన్ ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపింది. ఆదివారం రాత్రి మన్మోహన్‌కు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులను ఆయనను హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలించారు.

ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. గుండె చికిత్స విభాగంలో కార్డియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ పర్యవేక్షణలో వైద్యం కొనసాగుతోంది. మార్చిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు వాయిదా పడటానికి ముందే మన్మోహన్‌సింగ్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వ్యక్తిగత వైద్యులు సూచించారు. 2009లోనూ మన్మోహన్‌సింగ్‌కు ఎయిమ్స్‌లో బైపాస్‌ సర్జరీ జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్ 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు ప్రధానిగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here