టెస్టింగ్ కిట్‌ల గుట్టురట్టు: చైనా నుంచి చవగ్గా కొట్టేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టోపీ!

దేశంలో పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ల కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్రాలే వీటిని నేరుగా కొనుగోలు చేసేలా వీలు కల్పించడంతో పలు ఫార్మా కంపెనీలు దీనిని అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకున్నాయి. తక్కువ ధరకు చైనా నుంచి కొనుగోలుచేసి.. దానికి రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కట్టబెట్టాయి. ఓ సంస్థ తక్కువ ధరకే కిట్ కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్మిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. మ్యాటిక్స్ ఫార్మా కంపెనీ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌ ఒక్కోదాన్ని చైనా నుంచి రూ. 245కు కొనుగోలు చేసింది.

దాని ధరను రూ. 600కు పెంచేసి, కేంద్రం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంగనామాలు పెట్టింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో ధరను వసూలు చేయడంతో దీని నిర్వాకం బయపడింది. మ్యాట్రిక్స్ నుంచి కిట్లను పొందిన డీలర్ సంస్థ రియల్ మెటాబాలిక్స్, ఆర్ ఫార్మాస్యుటికల్స్‌లు ఈ నిర్వాకానికి పాల్పడి, కేంద్రాన్ని మోసం చేశారు.

మాట్రిక్స్ నుంచి టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన మరో డీలర్ షాన్ బయోటెక్.. తమిళనాడు ప్రభుత్వానికి వీటిని అమ్మడంతో వివాదం బయటపడింది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న మ్యాట్రిక్స్.. నిబంధనలకు విరుద్ధంగా షాన్ బయోటెక్‌కు టెస్టింగ్ కిట్లను విక్రయించిందని రియల్ మెటబాలిక్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో గుట్టురట్టయ్యింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన .. ఇరు వర్గాలు వాదనలు విని ఏప్రిల్ 24న తీర్పును వెలువరించింది. వివాదంతో మంచే జరిగిందని, మహమ్మారి కారణంగా ప్రపంచం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష తగ్గించుకోవాలని సూచించింది. వాస్తవ ధర రూ.245, జీఎస్టీతో సహా మిగతా పన్నులు రూ.155తో కలిపి ఒక్కో టెస్టింగ్ కిట్ ధర రూ. 400కు మించరాదని ధర్మాసనం ఆదేశించింది. ఒప్పందం వివాదాన్ని పక్కనబెట్టి, ప్రతి పంపిణీదారుడు కేసును చర్చించి పరిష్కరించుకుని, ప్రజలకు మేలు చేయాలని సూచించింది.

కాగా, చైనాకు చెందిన వాండ్ ఫో సంస్థ తయారు చేసిన ఈ కిట్లను భారత ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు కొనుగోలు చేశాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో ధరపై వీటిని కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏ కిట్ కు అయినా గరిష్ఠంగా రూ. 400 ధర మించరాదని హైకోర్టు ఆదేశించింది. టెస్టింగ్ కిట్లను అధిక ధరకు విక్రయించిన విషయమై ఐసీఎంఆర్ ఇంకా స్పందించలేదు.

ఒక్కోటి రూ.600 చొప్పున మొత్తం 5 లక్షల టెస్టింగ్ కిట్‌లకు ఐసీఎంఆర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో మ్యాట్రిక్స్ సంస్థ చైనా నుంచి ఒక్కో కిట్ రూ.245కే తెప్పించింది. ఐసీఎంఆర్‌తో రూ.30 కోట్లకు ఒప్పందం కుదురగా.. చైనా నుంచి రూ.12.25 కోట్లకే కిట్స్ తెప్పించినట్టు కోర్టు అభిప్రాయపడింది. వీటిని రేర్ మెటాబాలిక్స్‌ రూ.21 కోట్లకు అమ్మగా.. వారికి రూ.9 కోట్ల మేర లాభం వచ్చిందని పేర్కొంది.

దిగుమతి చేసుకున్న వైద్య సామగ్రికి విలువ అదనంగా లేనప్పటికీ రూ. 30 కోట్లలో ఐసిఎంఆర్ అదనంగా 18.7 కోట్లు చెల్లించడంతో మధ్యవర్తుల లబ్ది పొందారని కోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ 276,000 కిట్‌లను ఐసిఎంఆర్‌కు పంపిణీ చేయగా, మిగతా 224,000 కిట్‌లు దిగుమతి చేసుకోగానే అందజేయాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here