కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఈ ఏడాది భారత్‌లోనే 6 కోట్ల డోసుల ఉత్పత్తి!

కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం వ్యాక్సిన్‌తో మాత్రమే సాధ్యం అవుతుందనే సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేపడుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. కోతులపై చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చాయి. రాకీ మౌంటెన్ ల్యాబొరేటరీలో ఆరు కోతులపై గత నెలరోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ అందించిన తర్వాత కోతులకు అధిక వైరస్‌ ప్రభావానికి గురయ్యేలా చూశారు. 28 రోజుల తర్వాత అన్ని కోతులూ ఆరోగ్యంగా ఉన్నాయని గుర్తించారు.

కోతులపై వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేయడంతో మనుషులపై ప్రయోగాత్మకంగా పరీక్షలు మొదలుపెట్టారు. 550 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. మే నెలాఖరులోపు 6 వేల మందిపై ఈ ప్రయోగం పూర్తి కానుంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తోన్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది 60 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రపంచంలోనే భారీ మొత్తంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సంస్థగా దీనికి పేరుంది. “ChAdOx1 nCoV-19”గా పిలుస్తోన్న ఈ వ్యాక్సిన్ కోవిడ్-19పై ప్రభావం చూపుతుందని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ జంతువులపై చేపట్టిన ప్రయోగాలు విజయవంతం కావడం.. మనుషులపై ప్రయోగాలు చేస్తుండటంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలని సీరమ్ నిర్ణయించింది.

ఈ ఏడాది 6 కోట్ల డోసులను ఉత్పత్తి చేయడంతోపాటు వచ్చే ఏడాదికి 40 కోట్ల డోసులను అందించాలని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ వ్యాక్సిన్లను ముందుగా భారత్‌లోనే అందించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ధరను సీరమ్ రూ.1000గా నిర్ణయించింది. కానీ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఉచితంగా అందించే అవకాశం ఉంది. పుణేలో ఈ సంస్థకు రెండు వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వచ్చే ఐదు నెలల్లో… నెలకు గరిష్టంగా 50 లక్షల డోసులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కోసమే ప్లాంట్ ఏర్పాటు కోసం ఆ సంస్థ రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here