కరోనా కట్టడిపై ఎలా ముందుకెళ్దాం.. సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

క రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ -3 మరో 6 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమాలోచనలు జరుపుతున్నారు. కొనసాగించాలా? సడలించాలా? సడలింపులు ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తున్నారు. సోమవారం (మే 11) మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.

లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఐదోసారి జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని రెండు సెషన్లుగా కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తొలి సెషన్‌, సాయంత్రం 6 గంటల నుంచి రెండో సెషన్‌ నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన సమావేశంలో కొద్ది మంది ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ఇలా షెడ్యూల్ చేశారు. ఈ సమావేశంలో అందరు సీఎంలకూ మాట్లాడే అవకాశం కల్పించనున్నారు.

మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4200 కేసులు నమోదయ్యాయి. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా? ఎత్తేస్తారా? అని దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here