కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3100 కోట్లు

క రోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన మోదీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం బుధవారం (మే 13) రూ.3100 కోట్లు విడుదల చేసింది. పీఎం కేర్ ట్రస్టు ఫండ్ నుంచి ఈ నిధులను కేటాయించారు. వీటిలో రూ.2000 కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు వెచ్చించనున్నారు. మరో రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం వినియోగించనున్నారు. రూ.100 కోట్లను కరోనా వ్యాక్సిన్ అభివ‌ృద్ధి కోసం కేటాయించారు.

రూ.2 వేల కోట్లతో సుమారు 5000 వెంటిలేటర్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కొవిడ్ ఆస్పత్రులకు అందజేయనున్నారు. అటు వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1000 కోట్లు మంజూరు చేశారు. వలస కార్మికుల వసతి, భోజన సదుపాయాలు, వైద్య చికిత్స, రవాణా కోసం ఈ నిధులను వినియోగిస్తారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఈ నిధులను ఖర్చు చేసేలా ఆదేశాలిచ్చారు.

కరోనా మహమ్మారితో పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసింది. దీనికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలు ముందు పెడుతున్నారు.

దేశంలో బుధవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 74,281కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,525 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో నేడు మరో 122 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 54 మంది మరణించారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 2415 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 24,386 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here