ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ నిర్ణయం.. 2.5 లక్షల మంది పాలిట శరాఘాతం

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 10 లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా.. దాదాపు 60వేల మంది మృత్యువాతపడ్డారు. దీంతో కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీనిలో భాగంగా అధ్య‌క్షుడు ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఇది 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయంతో వలసదారుల నెత్తిన పిడిగుపడ్డట్టయ్యింది. రెండు నెలల పాటు నిషేధం విధించడంతో ఈ సమయంలో వీసా కాలపరిమితి ముగిసేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పువు.

ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురుచూస్తుండగా వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. ట్రంప్ నిర్ణయంతో వీరంతా ఈ ఏడాది జూన్ చివరి నాటికి చట్టపరమైన హక్కును కోల్పోనున్నారని పాలసీ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం కోరుకుంటున్న వేలాది మంది స్వదేశాలకు తిరుగుపయనమవుతారని అంటున్నారు. H-1Bవీసాదారులలో మూడొంతుల మంది ఐటీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తులే ఉంటారని తెలిపారు.

గత రెండు నెలల్లో పది లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కానీ, ఇప్పుడు వీసాపై వచ్చినవారికి స్థానికులు కంటే ఎక్కువ నష్టం వాటిళ్లుతోందని అన్నారు. హెచ్-1బీ వీసాలు నిర్ధిష్ట ప్రదేశానికి పరిమితమయి ఉంటాయి. నిబంధనల ప్రకారం వీరికి సంస్థలు కనీస వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం వీరికి అమెరికాలో ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది. ట్రంప్ నిర్ణయం వీరి పాలిట శరాఘాతమయ్యింది. ఒకవేళ ఉద్యోగం దొరకడానికి, వేరే వీసా ప్రయత్నాలు, దేశం విడిచి వెళ్లడానికి 60 రోజుల సమయం పడుతుంది. ఉద్యోగాలలో కొనసాగినా ఈ సమయంలో వీసాలను పునరుద్ధరించలేకపోతే మరింత గందరగోళంలోకి వెళతారు.

వీసా సంక్షోభం మానవ, ఆర్థిక స్థాయిలో విపత్తుకు దారితీస్తుందని ఒబామా హయాంలో టెక్నాలజీ, ఇమ్మిగ్రేషన్ పాలసీపై పనిచేసిన డౌగ్ రాండ్ వ్యాఖ్యానించారు. టెక్ నెట్ గ్రూప్‌లో యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు విదేశీ ఉద్యోగులకు ఉపశమనం కోరుతూ ఏప్రిల్ 17 న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలకు ఒక లేఖ రాశాయి. కనీసం సెప్టెంబర్ 10 వరకు గడువు తేదీను పొడిగించాలని ఈ లేఖలో అభ్యర్థించాయి. ఎలాంటి చర్యలు లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగాలను కోల్పోవడమే కాదు..ఆర్ధిక వ్యవస్థిపై తీవ్ర ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here