ఆ సాధువును దారుణంగా కొట్టి చంపారా.. అసలేం జరిగింది?

క్లెయిమ్:

ఓ హిందూ సాధువుపై బంగ్లాదేశీలు మరి కొంత మంది దుండగులు దారుణంగా దాడి చేసి కొట్టారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. గాయాల పాలైన ఓ హిందూ సాధువు ఫోటోను షేర్ చేస్తూ ఏమిటీ ఈ దారుణం అని కామెంట్ పెట్టారు. ‘మరో హిందూ సాధువుపై సామూహిక దాడి. వృందావన్‌లో ఈ దారుణం. అక్రమంగా భారత్‌కు వచ్చిన బంగ్లాదేశీల దుశ్చర్య. ఇది చాలా దారుణం. హిందువుల పవిత్ర పట్టణాల్లో ఏమిటీ ఘోరం? ఈ క్రిమినల్స్ అంతటా పెరుగుతున్నారు’ అనే వ్యాఖ్యలున్న ఓ ఫోటో (స్క్రీన్‌షాట్)ను రితూ రాథూర్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. స్థానిక పోలీసులు నేరస్థులకు సహకరిస్తూ ఈ ఘటన బయటకి రాకుండా చూస్తున్నారంటూ ఆ పోస్టులో ఆరోపణలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ట్యాగ్ చేస్తూ రితూ రాథూర్ దీన్ని షేర్ చేశారు.

ఇదే ఇమేజ్‌ను పలువురు వాట్సాప్‌లోనూ షేర్ చేశారు. మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చగొడుతూ కామెంట్లు పెట్టారు. హిందూ సాధువును దారుణంగా కొట్టి చంపారంటూ కొంత మంది ఈ ఫోటోను షేర్ చేశారు.

ఫేస్‌బుక్‌లోనూ ఇదే ఫోటో వైరల్ అయింది. ‘వృందావన్‌లో ఓ హిందూ సాధువుపై దారుణం. వైష్ణవ మత ప్రబోధకుడైన తమల్ కృష్ణ దాస్ అనే సాధువును దారుణంగా కొట్టి చంపారు. ఇమ్లితాలా ఆలయంలో ఈ దారుణం జరిగింది. దాడి చేసిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారని తెలుస్తోంది. కొంత మంది నాన్-లోకల్స్‌ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. మథురా పోలీసులు ఈ ఘటనను బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. అందరికీ తెలిసేలా షేర్ చేయండి’ అంటూ ‘ది సర్కాస్టిక్ విమెన్’ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి చేసిన పోస్టు వైరల్ అయింది.

వాస్తవం:

సదరు ఫోటోలో ఉన్న సాధువు ఇమ్లితాలలోని గౌధియా మఠానికి చెందిన తమల్ కృష్ణ దాస్‌గా పోలీసులు వెల్లడించారు. ఆయన బతికే ఉన్నారని, ఆస్పత్రిలో కోలుకుంటున్నారని తెలిపారు.

ఈ ఘటనలో ఎలాంటి మత ఘర్షణల కోణం లేదని మథురా పోలీసులు స్పష్టం చేశారు. ట్విటర్‌లో వైరల్ అవుతున్న ఫేక్ వార్తకు తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా బదులిస్తూ.. ఘటనలో మత ఘర్షణలు లేవని వెల్లడించారు.

ఘటనపై వివరణ ఇస్తూ పోలీసులు మరో వీడియోను కూడా ట్వీట్ చేశారు.

పోలీసులు ట్వీట్ ద్వారా వెల్లడించిన వివరాలు:

* ఇమ్లితాలలోని గౌధియా మఠంలో ప్రస్తుత అధ్యక్షుడు బీపీ సాధు, మాజీ అధ్యక్షుడు తమల్ దాస్ అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

* ఈ క్రమంలో బీపీ సాధు అనుచరులు గోవింద, సచ్చిదానందతో పాటు సెక్యూరిటీ గార్డ్ గోవింద్ సింగ్.. తమల్ దాస్‌పై దాడికి పాల్పడ్డారు. లైబ్రరీ రూము గది తాళం తెరిచే విషయంలో జరిగిన ఘర్షణలో ఈ దాడి జరిగింది.

* ఘటనలో తీవ్రంగా గాయపడిన తమల్ దాస్‌ను మథురా జిల్లా ఆస్పత్రికి తరలించాం.

* ఘటనలో ప్రధాన నిందితుడైన సచ్చిదానందను వృందావన్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

* ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

తీర్పు:

టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలనలో తేలింది ఏమిటంటే.. వృందావన్‌ ఘటనలో గాయపడిన సాధువు విషయంలో మత ఘర్షణలకు ముడిపెట్టి చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు సాధువును కొట్టి చంపారని వైరల్ అవుతున్న వార్త ఫేక్. ఈ ఘటన వెనుక ఎలాంటి మత ఘర్షణలు లేవు. మరణించాడని షేర్ చేస్తున్న ఆ ఫోటోలోని సాధువు బతికే ఉన్నారు. ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here