ఆ దుకాణాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. కేంద్రం మరో కీలక నిర్ణయం

నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే పూర్తిగా ప్రగతి రథం నిలిచిపోకుండా కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా మినహాయింపులను ఇస్తోంది. వైరస్‌ను కట్టిడి చేస్తూ ఏప్రిల్ 20 నుంచి ఆర్ధిక కార్యకలాపాలను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో మరికొన్నింటికి కేంద్రం శుక్రవారం అనుమతించింది. మున్సిపాల్టీల వెలుపల, సమీపంలో ఉన్న రెసిడెన్షియల్, మార్కెట్ కాంప్లెక్స్‌ల్లో వ్యాపార కార్యకలాపాల ప్రారంభానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. అయితే, కేవలం నాన్-కంటెయిన్‌మెంట్ జోన్‌లకు మాత్రమే ఇవి పరిమితమని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ మినహాయింపులు మున్సిపాల్టీల పరిధిలో, వెలుపల ఉన్న సింగిల్, మల్టీ-బ్రాండ్ మాల్స్‌కు వర్తించవని పేర్కొంది.

విపత్తు నిర్వహణ చట్టం 2005ను అనుసరించి ఏప్రిల్ 15న జారీ చేసిన మార్గదర్శకాలలో హోంశాఖ సవరించి ఉత్తర్వులను జారీచేసింది. దుకాణాలను 50 మంది సిబ్బందితో నిర్వహించాలనే షరతులకు లోబడి ఉండాలని పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూర నిబంధనలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని సూచించింది. సమయంలో షాపింగ్ కాంప్లెక్సులు తెరవకుండా నిరోధించే కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల సబ్-క్లాజ్ 1 (10) ను సవరించి, షాపింగ్ కాంప్లెక్స్ అనే పదాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలోని లేని మార్కెట్ కాంప్లెక్స్‌తో భర్తీ చేసినట్లు తెలిపింది.

అలాగే, లాక్‌డౌన్ కాలంలో అనుమతించబడిన వాణిజ్య, ప్రైవేట్ సంస్థలపై క్లాజ్ 14 కింద సబ్-క్లాజ్ (13) & (14) లో సంబంధిత రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం దుకాణాల స్థాపన చట్టం కింద నమోదయిన మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వెలుపల షాప్‌లు, రెసిడెన్షియల్, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని దుకాణాలు, సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ మాల్స్‌లో 50 శాతం మంది సిబ్బంది, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

రెండు రోజుల కిందట పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు విక్రయించే షాపులు, బుక్ షాపులకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ రీఛార్జీ షాప్‌లు, బ్రెడ్ ఫ్యాక్టరీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రోడ్డు నిర్మాణ పనులు, సిమెంట్‌ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం షరతు విధించింది. గత 28 రోజులు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో 12 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here