ఆర్మీ ఆస్పత్రిలో కరోనా అలజడి.. 24 మందికి పాజిటివ్

సై న్యంలో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో 24 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరిలో సర్వీస్‌లో ఉన్నవారు, రిటైర్ అయినవారు ఉన్నారు. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో ప‌నిచేస్తున్న సైనిక ఉద్యోగులకు వైర‌స్ సోకిన‌ట్లు మంగళవారం (మే 5) అధికారులు వెల్లడించారు. వైర‌స్ సోకిన వారంద‌రినీ ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ ఆస్పత్రికి త‌ర‌లించినట్లు తెలిపారు. సామూహిక వ్యాప్తి (క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్) జ‌రిగిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఖండించారు.

అటు ఐటీబీపీలోనూ కరోనా అలజడి రేపుతోంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగానికి చెందిన 45 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇప్పటివరకు ఢిల్లీలోనే విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 195 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. 12,727 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 27.41 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here