అత్తింటి వేధింపులకు వివాహిత బలి.. విజయవాడలో విషాదం

కట్నపిశాచికి మరో వివాహిత బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బతిమాలి తెచ్చుకున్నాడు. కానీ మళ్లీ మళ్లీ అవే వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తన జీవితం ఇంతే అనుకుని విరక్తి చెందిన భార్య అఘాయిత్యానికి ఒడిగట్టింది. పుట్టింటికి వచ్చేసి ఉరేసుకుని లోకాని విడిచిపెట్టింది. ఈ విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

నగరంలోని కబేళా సెంటర్ న్యూభగత్‌సింగ్ నగర్‌కి చెందిన నిరంజన్ వలి కూతురు నగీనాని గుంటూరుకు చెందిన ఖాశీం షరీఫ్‌కిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. కొద్దికాలం కాపురం సాఫీగా సాగినా నెమ్మదిగా అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేయడంతో భరించలేక వివాహమైన ఏడాదికే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

Also Read:

అప్పటి నుంచి రెండేళ్లు పుట్టింట్లోనే ఉంది. అయితే ఏడాది కిందట భర్త షరీఫ్ తప్పు ఒప్పుకుని.. భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడు. భర్తను నమ్మిన నగీనా అతని వెంట వెళ్లేందుకు అంగీకరించింది. అత్తారింటికి వచ్చిన కొద్దిరోజులు బాగానే ఉన్నా మళ్లీ అవే వేధింపులు మొదలయ్యాయి. అత్త వహీదా, భర్త షరీఫ్ అదనపు కట్నం కోసం వేధించడంతో తిరిగి పుట్టింటికి చేరింది.

నిత్యం వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన నగీనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రి వేళ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here