సూర్యనమస్కారాలు ఎప్పుడు పుట్టాయి

రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలోని 35 నుంచి 40 శాతం కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. మిగతావన్నీ పనీపాటా లేకుండా బద్ధకంగా ముడుచుకుని పడుంటాయి. పన్నెండు సూర్యనమస్కారాలతో 95 నుంచి 97 శాతం కండరాల్లో కదలిక వస్తుంది. మరుసటి రోజు ‘రీఛార్జ్‌’ చేసేదాకా అవి చురుగ్గా ఉంటాయి. సూర్యనమస్కారాల ప్రభావాన్ని తెలుసుకోడానికి ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయంలో లోతైన పరిశోధనలు చేశారు. సూర్యనమస్కారాల్ని ఆరు రౌండ్లతో ప్రారంభించి…క్రమక్రమంగా ఇరవై నాలుగుదాకా తీసుకెళ్లడం ద్వారా… సాధకుల ఆరోగ్య పరిస్థితిలో వచ్చిన మార్పులను నవోదు చేశారు.
ఇవి శ్వాసవ్యవస్థ మీద చాలా ప్రభావం చూపాయని నిపుణులు గుర్తించారు. ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా మెరుగుపడింది. మునుపటి కంటే ఎక్కువ సేపు పనిచేయగల సత్తువ వచ్చింది. శరీర వ్యవస్థ మరింత శక్తిమంతమైంది. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ పరిశోధనలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. సూర్యనమస్కారాల వల్ల గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లోని అ డ్డంకులు తొలగిపోవడం గమనించారు పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం ప్రతినిధులు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పుణెశాఖ ప్రతినిధి డాక్టర్‌ దిలీప్‌ శార్దా ఐదువందల మందిపై తాను జరిపిన అధ్యయన ఫలితాల్ని పత్రికాముఖంగా వెల్లడించారు.
ముఖ్యంగా ముప్ఫై నుంచి ఎనభై సంవత్సరాలవారిలో… రక్తపోటు క్రమబద్ధం అయినట్టు నిర్ధరించారు. కొలెస్ట్రాల్‌, బ్లడ్‌షుగర్‌, కొవ్వు…తదితరాల్లో ఆరోగ్యకరమైన తేడాను గుర్తించినట్టు చెప్పారు. అమెరికాలోని శాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీలోనూ కొన్ని అధ్యయనాలు జరిగాయి. వృద్ధాప్యాన్ని మందగింపజేయగల సామర్థ్యం సూర్యనమస్కారాలకు ఉందని విశ్వవిద్యాలయ వర్గాలు ప్రకటించాయి. జీవక్రియతో పాటు గుండె పనితీరు మీద కూడా వీటి ప్రభావం ఉంటుందని కె.బి.గ్రంట్‌ అనే హృద్రోగవైద్యుడు గుర్తించాడు. పొట్టచుట్టూ పేరుకుపోయే కొవ్వును సూర్యనమస్కారాలు సులభంగా కరిగిస్తాయని సాధకులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
‘జీవన తత్వయోగ’ సంస్థ ప్రాచీనమైన పద్ధతికి చిన్నచిన్న మార్పులు చేసి డైనమిక్‌ సూర్యనమస్కారాల్ని రూపొందించింది. దీనివల్ల రెండుమూడుసార్లు సాధన చేసినా, అంతకు రెట్టింపు ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పరిమితులూ:
సూర్యనమస్కారాలు ఎప్పుడు పుట్టాయి? ఆవిష్కర్త ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పతంజలి యోగసూత్రాల్లో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. గత శతాబ్దంలో ఔంధ్‌ రాజైన భవన్‌రావు ప్రాచుర్యంలోకి తెచ్చినట్టు ఓ కథనం. ఆయన లండన్‌లో న్యాయశాస్త్రం చదువుతున్న రోజుల్లో వాటివల్ల తానెంత ప్రయోజనం పొందిందీ ఓ రచయితకి యథాలాపంగా చెప్పారట. వాటి ఆధారంగా ‘టెన్‌ పాయింట్‌ వే టు హెల్త్‌’ అనే పుస్తకం వచ్చిందనే వాదన ఉంది. ఆ అభిప్రాయాన్ని కాదనలేం. కానీ, భవన్‌రావు సూర్యనమస్కారాల సృష్టికర్త కాకపోవచ్చు. మహాఅయితే, వాటి ప్రచారానికి కృషిచేసి ఉండవచ్చు. వేదకాలం నాటికే అవి ఉనికిలో ఉన్నాయి. ఇప్పుడు, సూర్యనమస్కారాలు ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యాయి.
జపాన్‌లో పన్నెండు ముద్రల్లోంచి ఏడింటిని తీసుకుని సాధన చేస్తున్నారు. వివిధ దేశాల్లోని యోగా కేంద్రాల్లో సూర్యనమస్కారాల్ని కూడా నేర్పుతున్నారు.
వీటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు. కొన్ని అపోహలూ ఉన్నాయి. సూర్యోదయ సమయంలో…తూర్పువైపుగా నిలబడి చేయడమే ఉత్తమం. సాధ్యం కాకపోతే, సూర్యాస్తమయంలో అయినా ఫర్వాలేదు. మిట్టమధ్యాహ్నవో, అర్ధరాత్రో చేయడం మంచిది కాదు. చాపకానీ దుప్పటి కానీ పరుచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. వదులైన దుస్తులు వేసుకుంటే మంచిది. కాలకృత్యాలు ముగించుకున్నాకే ప్రారంభించాలి. ఖాళీ కడుపుతో చేయాలి. వెంటనే, భోజనం కూడదు.
కాస్త సేదదీరాక మంచినీళ్లో పళ్లరసవో తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన లేదు. వెుక్కుబడిగా ఒకటిరెండుసార్లు చేయడం వల్ల లాభం ఉండదు. అలా అని, శరీరాన్ని హింసిస్తూ అదేపనిగా చేయడమూ నిష్ఫలమే. వయసు, ఆరోగ్య పరిస్థితి, అందుబాటులో ఉన్న సమయం…వంటి అంశాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తీవ్రస్థాయిలో రక్తపోటు ఉన్నవారు, హృద్రోగులు, ఆర్థరైటిస్‌, హెర్నియా తదితర సమస్యలతో బాధపడుతున్నవారు దూరంగా ఉండటమే మేలు. వెన్నెముక సమస్యలున్నవారు నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. గర్భిణులు దాదాపు నాలుగు నెలల దాకా చేయవచ్చు. దీనివల్ల సుఖప్రసవం జరుగుతుంది. అయితే, వైద్యుల సలహా తప్పనిసరి. ప్రసవమైన నలభైరోజుల తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు. ఇక, ఎనిమిదేళ్లలోపు పిల్లలు ప్రత్యేకంగా సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ వయసులో ఆటపాటల్ని మించిన వ్యాయామం ఏముంటుంది? ఆరోగ్యవంతులైన వృద్ధులకూ ఎలాంటి పరిమితుల్లేవు.
మహిళలకు నెలసరి రోజుల్లో తీవ్ర రక్తస్రావం వంటి సమస్యలుంటే, ఆ మూడునాలుగు రోజులూ ఆపేయడమే మంచిది.
సూర్యనమస్కారాలు చేస్తున్నప్పుడు…ఒత్తిడి వద్దు, తొందరవద్దు. ప్రశాంతంగా చేయాలి. శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వాలి. ఆలోచనలకు పగ్గాలు వేయాలి. సూర్య మంత్రం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆ తేజస్సును మనలో ఆవాహనం చేసుకోవాలి. క్రమంగా, సూర్యనమస్కారాలకు ప్రాణాయామాన్ని కూడా జోడిస్తే మరీ మంచిది.
సూర్యనమస్కారాలు ఖరీదైన వ్యవహారమేం కాదు. ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పన్లేదు. ఓ వారవో, పదిరోజులో సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు. జీవితాంతం సాధన చేసుకోవచ్చు. యోగాలో ఉన్నట్టు వందలకొద్ది ఆసనాలూ ఉండవు. తికమకపడాల్సిన అవసరం లేదు. కొన్నింటినే పునరావృతం చేస్తూ వెళ్లడమే కాబట్టి, గుర్తుంచుకోవడం పెద్ద సమస్యేం కాదు. ‘మాకు తీరిక లేదు’…అని వాదించేవారికి ఒకటే ప్రశ్న? ‘రేపు ఏ గుండె జబ్బో వస్తే (రాకూడదనే కోరుకుందాం), సర్జరీ చేయించుకోడానికి కూడా టైం ఉండదా? ఏ రక్తపోటో చక్కెర వ్యాధో వేధిస్తే (వేధించకూడదనే ఆశ), డాక్టర్ల చుట్టూతిరగడానికి కూడా టైం ఉండదా?’. కొంపలేం మునిగిపోవు. రోజూ ఓ అరగంట కేటాయించినా చాలు. ప్రారంభంలో కాస్త నిదానంగా సాగినా, సాధన పెరిగాక వేగం పుంజుకుంటుంది. సూర్యనమస్కారాలు జీవితంలో భాగమైపోతాయి. సూర్యుడికి ‘శుభోదయం’ చెప్పడంతోనే మీ దినచర్య వెుదలవుతుంది.
* * *
యోగా గురువుగారిని అత్యాధునికమైన జిమ్‌కు తీసుకెళ్లాడు ఓ యువకుడు. అక్కడున్న పరికరాలన్నీ చూపిస్తున్నాడు.
‘ఇది ఛాతీ వ్యాయామానికి సంబంధించింది…’
‘ఇది చేతులకు సంబంధించింది’
‘ఇది పొత్తికడుపు కోసం…’
అలా సాగుతోంది పరిచయం.
చివర్లో అడిగారు గురూజీ… ‘ఇంతపెద్ద జిమ్ములో వెుత్తం శరీరానికంతా పనికొచ్చే పరికరం ఒక్కటీ లేదా?’.
బిక్కవెుహం వేశాడు సిక్స్‌ప్యాక్‌ కుర్రాడు.
మొత్తం శరీరానికే కాదు, మనసుకూ బుద్ధికీ కూడా ఒకటే వ్యాయామం…అవే సూర్యనమస్కారాలు!
వెలుగుల దేవుడికి వందనం
సూర్యనమస్కారాలు వెుత్తం పన్నెండు. ఎనిమిదో ఆసనం తర్వాత మళ్లీ నాలుగు, మూడు, రెండు, ఒకటి ఆసనాలే పునరావృతం అవుతాయి. ప్రణామస్థితి నుంచి ప్రణామస్థితి దాకా ఒక రౌండు. నిపుణుల పర్యవేక్షణలో సాధన ప్రారంభించడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here