Visakhapatnam Gas Leak ప్రమాదికరమైన ఆ గ్యాస్ నరాలపై తీవ్ర ప్రభావం.. కేన్సర్ కారకం కూడా

గురువారం తెల్లవారుజామున విశాఖలోని జరిగిన విషవాయువు దుర్ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు 30 ఏళ్ల కిందటి భోపాల్ మిథైల్ ఐసోసైనేట్ దుర్ఘటనను ఒక్కసారిగా గుర్తుకుతెచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. విశాఖలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమార్స్ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు ప్రమాదకరమైనదని విశాఖ కేజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

గ్యాస్‌ పీల్చిన వెంటనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపి అపస్మారక స్థితికి వెళుతుంటే.. మరికొందరు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు. ఆర్‌.ఆర్‌.వెంకటాపురంతో పాటు, విశాఖ 66వ వార్డుపై విషవాయువు ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు 300 మంది విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైనట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. మృతులు, బాధితుల్లో ఎక్కువ మంది ఆర్‌.ఆర్‌.వెంకటాపురం వాసులే ఉన్నారు. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో మున్సిపల్‌ సిబ్బంది రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

‘గ్యాస్‌ పీల్చితే నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తలనొప్పి, వాంతులు, వినికిడి లోపం, తీవ్రమైన మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది’’ అని మంగళగిరి 10వ ఎన్డీఆర్ కమాండెంట్ జాహిద్ ఖాన్ తెలిపారు. గ్యాస్‌ ప్రభావానికి గ్రామాల్లోని చెట్లన్నీ మాడిపోయాయి. విషవాయువు పీల్చిన మూగజీవాలు నురగలు కక్కుతూ నేలకొరిగాయి. గ్యాస్‌ ప్రభావానికి ఉక్కిరి బిక్కిరి అయిన స్థానికులు ఎటు వెళ్తున్నారో కూడా తెలియకుండా పరుగులు తీసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ఇక, పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) దేశంలో అత్యంత తీవ్రమైన ప్రమాదకర వ్యర్థ ప్రదేశాలను గుర్తించి, వీటిని జాతీయ ప్రాధాన్యతల జాబితాలో (ఎన్‌పిఎల్) ఉంచుతుంది. ప్రస్తుతం ఎన్పీఎల్ సైట్‌లలో కనీసం 31లో స్టైరిన్ గుర్తించారు. ఒక కర్మాగారంలోని కంటైనర్ నుంచి స్టైరిన్‌ గ్యాస్ బయటకు వస్తే లక్షణాలు, జీవనశైలి, ఆరోగ్య స్థితిపై అది ఎంత కాలం ప్రభావం చూపుతుందో ఈపీఏ స్పష్టం చేసింది.

రంగులేని ద్రవరూపంలో ఉండే ఈ గ్యాస్ కంటెయినర్ నుంచి బయటుకు వస్తే త్వరగా గాలిలో వ్యాపిస్తుంది. గాలిలోకి చేరిన తర్వాత సాధారణంగా ఇది 1 నుంచి రెండు రోజులు ఉంటుంది. నిస్సారమై నేల, ఉపరితల నీటిలో స్టైరిన్ ఆవిరివుతుంది. పాలిమర్స్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు స్టెరైన్ ప్రభావానికి గురువుతారు. ఇది నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చూపు మందగించడం, అలసట, మత్తుగా ఉండటం, వేగంగా స్పందించకపోవడం, ఏకాగ్రత లోపించడం, సమతౌల్యత లేకపోవడం తదితర సమస్యలు వెంటాడుతాయి.

ఈ ప్రభావాలకు కారణమయ్యే స్టైరిన్ సాంద్రతలు సాధారణంగా వాతావరణంలో కనిపించే స్థాయిల కంటే 1,000 రెట్లు అధికంగా ఉంటుంది. జంతువుల్లో ముక్కు, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్టైరెన్ ఎక్కువగా పీల్చితే మానవ పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. వీర్యకణాలు దెబ్బతింటాయి. కేన్సర్‌కు కారణమవుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ 2011 జూన్‌లో ఓ నివేదినకు విడుదల చేసింది.

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ కేన్సర్ సైతం స్టైరిన్ ఒక క్యాన్సర్ కారకమని నిర్ణయించింది. చిన్నారులు, పెద్దలు అందరిపైనే ఒకేలా ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. స్టైరిన్ ప్రభావానికి గురైన మహిళలకు పుట్టే పిల్లలకు తక్కువ బరువు లాంటి సమస్యలు ఎదురవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here