అవి ఎలియన్స్ కాదు .. మొత్తం మీద సస్పెన్స్ తెరపడింది

ఇటీవల విశాఖలోని వన్ టౌన్ లో ఓ సంస్థ కార్యాలయంలో వెలుగుచూసిన వింత పక్షులను ఎలియన్స్ గా భావిస్తూ సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం జరిగిన సంగతి విదితమే. అయితే, అటవీశాఖాధికారులు వీటిని పరిశీలించి, ఇవి జీలుగు పక్షులని తేల్చారు. పట్నవాసులకు అవేంటో తెలియదని, ఇవి అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని వారు వెల్లడించారు. గుడ్లగూబ జాతికి చెందిన ఈ జీలుగు పక్షులు వాటికంటే పెద్దగా ఉంటాయని చెప్పారు. వీటిని ఇంగ్లిష్ లో బార్న్ ఔల్స్ అంటారని, వాటి సాంకేతిక నామం టైటో ఆల్బా అని, తెలుగులో జీలుగు పక్షులని వారు వెల్లడించారు.
 ఇవి పుట్టిన కొద్ది రోజులవరకు వెంట్రుకలు మొలవవని, దీంతో ఇవి చిత్రంగా కనిపిస్తాయని వారు పేర్కొన్నారు. ఇవి పూర్తిగా నిశాచర జీవులని వారు తెలిపారు. రాత్రిపూట ఇవి స్పష్టంగా చూడగలవని, ఎలుకలు, పందికొక్కులను ఆహారంగా తీసుకుంటాయని అన్నారు. వీటి వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు చెప్పారు.
వీటికి వెలుతురు చూపించడం (ఫోటోలు, వీడియోల లైటింగ్) మంచిది కాదని అన్నారు. ఇవి తల్లి సంరక్షణలో పెరుగుతాయని వారు చెప్పారు. వాటిని ఇబ్బంది పెట్టడం వల్ల మృతి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, వాటిని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల (జూ) అధికారులు తీసుకెళ్లారు. వారిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటి తల్లి వాటికి ఆహారం తెచ్చి పెడుతోందని, వాటిని తీసుకెళ్లడం వల్ల పిల్లలు మృతి చెందే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here