గ్యాస్ స్ట‌వ్ ను కంట్రోల్ చేసే యాప్‌!

సాధారణంగా మ‌హిళ‌లు వంట చేస్తున్నపుడు వేరే ప‌నిలో పడి గ్యాస్ స్టవ్ క‌ట్టేయడం మ‌ర‌చి పోతుంటారు. ప‌క్కింటి వాళ్లు వ‌చ్చి మీ ఇంట్లో కూర మాడిపోయినట్లుంద‌ని చెబితే గానీ స్ట‌వ్ క‌ట్టేయ‌డం మ‌ర‌చిపోయిన సంగ‌తి గుర్తు రాదు. కొన్ని సంద‌ర్భాల్లో గ్యాస్‌ కట్టేయడం మర్చిపోతే అగ్నిప్రమాదాలు జ‌ర‌గ‌వ‌చ్చు. అయితే, ఇక‌పై మ‌హిళ‌ల‌కు ఆ తిప్ప‌లు త‌ప్ప‌నున్నాయి. ఎంచ‌క్కా ఓ యాప్ తో మ‌హిళ‌లు స్ట‌వ్ ను ఆటోమేటిక్ గా ఆపేయ‌వ‌చ్చు. లేటెస్ట్ టెక్నాల‌జీతో రూపొందించిన‌ గ్యాస్‌ స్టవ్‌ రెగ్యులేటర్లకు అనుసంధానమైన యాప్‌ ద్వారా గ్యాస్‌ స్టవ్‌ను ఆఫ్‌.. ఆన్ చేసుకోవ‌చ్చు.

ఈ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టింది భార‌తీయులు కావ‌డం విశేషం. రంజిత్‌బాబు.. అక్షిత అయ్యర్‌లు కలిసి ‘ఇనిర్వ్‌ రియక్ట్‌’ పేరుతో స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. సెన్సార్లతో కూడిన గ్యాస్‌స్టవ్‌ను ఆఫ్‌.. ఆన్‌ చేసే రెగ్యులేటర్లను రూపొందించారు. వీటిని గ్యాస్‌స్టవ్‌, మైక్రో వోవెన్స్‌కి అమర్చుకోవచ్చు. రెగ్యులేటర్లతో పాటు సెన్సార్‌ డివైజ్ ఉంటుంది. ఆ సెన్స‌ర్ డివైజ్ ను వంటగది రూఫ్‌కి అమర్చుకోవాలి. ఆ డివైజ్ ఒక యాప్‌తో అనుసంధానమై ఉంటుంది.

మ‌నం పొర‌పాటున గ్యాస్‌ కట్టేయడం మర్చిపోయినా, ఇంట్లో పొగలు వచ్చినా మ‌న మొబైల్‌కి అలర్ట్స్‌ని పంపిస్తుంది. ఎంచ‌క్కా ఈ యాప్ ద్వారా  ఇంట్లో ఉన్న గ్యాస్‌స్టవ్‌ ఆఫ్ చేయ‌వ‌చ్చు. అంతేకాదండోయ్‌, ఈ సెన్సార్‌ డివైజ్‌….. మనుషుల్ని స్కాన్ కూడా చేస్తుంది. వంటగదిలో 15నిమిషాలపాటు మ‌నుషులు ఎవరూ లేకపోతే.. ఆటోమెటిక్‌గా గ్యాస్‌స్టవ్ ను ఆఫ్‌ చేసేస్తుంది. ఈ యాప్‌తో ఎంచ‌క్కా మంటను త‌గ్గించే, పెంచుకొనే స‌దుపాయం కూడా ఉంది.

చాలా మంది ప్ర‌జ‌ల‌కు, అందులోనూ మ‌తిమ‌రుపు ఉన్న వారికి ఈ యాప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ సెన్స‌ర్ డివైజ్ ను ఇంట్లో అమర్చుకోవాలంటే దాదాపు రూ.16వేలు ఖర్చవుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్న ఈ డివైజ్ ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు తయారీదారులు సిద్ధ‌మ‌వుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here