మోడీ ఇలాకాలో.. కాంగ్రెస్ మొగోడు!

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను ఎదుర్కొని.. వారి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఏమైనా.. ఎవరైనా సాధించగలరా? కష్టమే కదా. కానీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి.. సీనియర్ నాయకుడు అయిన అహ్మద్ పటేల్.. ఆ ఘనత సాధించారు. అమిత్ షా మంత్రాంగాన్ని మించిన వ్యూహాలు పన్ని.. గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

గుజరాత్ లో.. 3 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. అందులో బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా ఆ పార్టీ అభ్యర్థులు అమిత్ షా, స్మృతీ ఇరానీ ఈజీగా విజయం సాధించారు. కానీ.. మూడో స్థానం కోసం.. బీజేపీ నుంచి బల్వంత్ సింగ్.. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడ్డారు. వాస్తవానికి అహ్మద్ పటేల్ గెలిచేందుకు 45 ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉన్నా.. కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయాలు.. అందుకు అడ్డం పడ్డాయి.

ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరితో.. వాఘేలా లాంటి సీనియర్ నాయకుడి వెంట మరో ఆరుగురు నడిచారు. దీంతో.. 57 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్.. 44కు పడిపోయింది. ఆ 44 ఓట్లు పడినా.. అహ్మద్ పటేల్ గెలవాలంటే.. మరో ఓటు అవసరం. ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి.. రాత్రి పొద్దుపోయే వరకూ ఫలితం రాకుండా ఆగింది.

కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఓటు వేయడమే కాకుండా.. తాము వేసిన ఆ ఓటును.. బయటికి చూపించడం ద్వారా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్ ను బ్యాలెట్ బాక్స్ లో వేయకుండా.. బయటికి చూపించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఈ విషయంలో బీజేపీ నేతల వాదనను పట్టించుకోకపోవడం.. చివరికి ఆ రెండు ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంతో.. గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య.. 44కు పడిపోయింది.

దీంతో.. అప్పటికే 44 ఓట్లు సొంతం చేసుకుని ఉన్న అహ్మద్ పటేల్.. విజయం సాధించి.. మోడీ ఇలాకాలో కాంగ్రెస్ కు ఉన్న పట్టును నిరూపించారు. ఈ విజయంతో.. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఉప్పొంగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here