820 కి.మీ. చేరుకొని, ఇంటికి కిలోమీటర్ దూరంలో వలస కూలీల దుర్మరణం

వి ధి ఎంత బలీయమైంది. కొన్నిసార్లు మనమొకటి తలిస్తే.. విధి మరొకటి తలుస్తుంది. అంతా సజావుగా సాగిపోతుంది అని సంతోష పడుతున్న తరుణంలో రాత్రికి రాత్రే విధి మన తలరాతను మార్చేయగలదు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లాలో జరిగిన ఘటన ఇదే విషయాన్ని చెబుతోంది. మనిషి జీవితం మట్టి రేణువుతో సమానం అని గుర్తుచేస్తోంది. లాక్‌డౌన్ వేళ చోటు చేసుకుంటున్న విషాద ఘటనల్లో ఇదొకటి..

పొట్ట చేతబట్టుకొని వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు, కార్మికులు లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. చేయడానికి పనిలేక, తినడానికి సరైన తిండిలేక తమను స్వస్థలాలను పంపించాలని కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. కొంత మంది పిల్లలను ఎత్తుకొని వేలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్తున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేకంగా బస్సులను, రైళ్లను ఏర్పాటు చేశారు. ఇలా సొంతూరుకు బయల్దేరిన ముగ్గురు కార్మికులు 820 కి.మీ. ప్రయాణించి మరో కిలోమీటరు ఉందనగా దుర్మరణం పాలైన విషాదమిది. దీని వెనుక గ్రామస్థుల తప్పిదం కూడా ఉంది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జిల్లా మోహన్‌పురాకు చెందిన విక్రమ్ సింగ్, అతడి భార్య భూలీ, బద్రీలాల్ బంజారా అనే ముగ్గురు వలస కూలీలు పని వెతుక్కుంటూ రాజస్థాన్ వెళ్లారు. తీరా లాక్‌‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయారు. సొంతూరికి వెళ్లిపోదామని కొన్ని వారాలుగా ఎదురుచూస్తున్న వాళ్లు చివరకు విసిగిపోయి కాలినడక ఎంచుకున్నారు. ఈలోగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను రప్పించడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

Must Read:

ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో ఈ ముగ్గురు కార్మికులు మంగళవారం (ఏప్రిల్ 28) ఉజ్జయిని ప్రాంతానికి చేరారు. దాదాపు 820 కి.మీ. ప్రయాణించి స్వగ్రామం మోహన్‌పురాకు చేరుకున్నారు. కానీ, సాంత ఊరివాళ్లే వాళ్లను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. కరోనా పరీక్షలు చేసుకున్నాకే ఊర్లోకి రావాలని తేల్చి చెప్పారు. బతుకు దేవుడా అనుకుంటూ ఆ ముగ్గురూ కాలినడకన ఉజ్జయినీ పట్టణంలో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే పెద్ద క్యూ. ఎలాగోలా నమూనాలు ఇచ్చారు. ఫలితాలు వెంటనే రావు. గ్రామానికి చేరుకునే సరికి అవి వస్తాయని భావించి మళ్లీ కాలినడక ప్రారంభించారు.

గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి చీకటి పడింది. నడిచీ, నడిచీ అలసి సొలసిన ఆ కార్మికులు గ్రామ శివార్లలోని ఓ ఆలయం వద్ద చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామునే గ్రామస్థుల అనుమతితో ఇంటికి చేరుకోవాలనేది వారి ప్లాన్. కానీ, వారొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. వేకువజామున 4 గంటల సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి చెట్టు కింద గాఢ నిద్రలో ఉన్న ఆ కూలీల పైనుంచి దూసుకెళ్లింది. చక్రాల కింద నలిగి ఆ ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

నిద్ర మత్తులో లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో విషాదం జరిగింది. లారీ తుక్కుతుక్కయింది. ప్రమాదం జరిగిన వెంటనే అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంత కాలం తిన్నా, తినకున్నా రాజస్థాన్‌లో ప్రాణాలతో అయినా ఉన్నారు. తీరా గ్రామ శివారు దాకా చేరుకున్న తర్వాత ఘోరం జరిగింది. గ్రామస్థులు వారిని అడ్డుకోకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని అందరూ ఆవేదన చెందుతున్నారు.

గ్రామస్థులు వారిని అడ్డుకున్న విషయంపై ఉజ్జయినీ ఎస్పీని ప్రశ్నించగా.. అలాంటిదేమీ తమ దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. అయినా.. బయటి నుంచి వస్తున్న వారికి బస్సుల్లో ఎక్కేటప్పుడే థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం కదా.. మరి వీళ్లను మళ్లీ పరీక్షల కోసం ఎందుకు ఒత్తిడి చేశారో కనుక్కుంటామని చెప్పారు. ఇప్పుడు కనుక్కొని మాత్రం ఏం చేస్తారు పాపం..?!

Photo Credit: Newindianexpress

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here