సైకిల్‌పై 1200 కిమీ.. మధ్యలోనే నీరసించి వలస కూలీ మృతి

పొ ట్టకూటి కోసం వలస వచ్చిన కూలీలు లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. సొంతూర్లకు వెళ్లాలనే తాపత్రయంతో సాహసాలకు పూనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రాణాల కోల్పోతున్నారు. వలస కార్మికుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చర్యలు తీసుకుంటున్నా ఈ విషాదాలు కొనసాగడం ఆవేదన కలిగిస్తోంది. ఢిల్లీకి వలస వచ్చిన 32 ఏళ్ల ఓ యువకుడు బిహార్‌లో స్వగ్రామానికి చేరుకోవడానికి సైకిల్‌ను ఎంచుకున్నాడు. 1200 కి.మీ. దూరం సైకిల్‌పై వెళ్లడానికి ప్రయత్నిస్తూ మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.

బిహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన ధరమ్‌వీర్ సింగ్ అనే యువకుడు ఢిల్లీలోని షాకూర్‌ బస్తీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయాడు. ఆదాయం లేక, తినడానికి తిండిలేక స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 28న మరో ఆరుగురు స్నేహితులతో కలిసి ఢిల్లీ నుంచి దాదాపు 1200 కి.మీ దూరంలో ఉన్న ఖగారియాకు సైకిళ్లపై బయల్దేరాడు.

పగలు సైకిల్ తొక్కుతూ.. రాత్రిళ్లు విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 350 కి.మీ. పాటు సైకిల్‌పై వారి ప్రయాణం సాగింది. ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌‌కు చేరుకోగానే చీకటి పడింది. దీంతో ఢిల్లీ-బరేలీ జాతీయ రహదారిపై ఓ టోల్‌ప్లాజా సమీపంలో ఆ ఆరుగురు కూలీలు నిద్రకు ఉపక్రమించారు. మరుసటి ఉదయాన్నే యథావిధిగా నిద్రలేచారు. తిరిగి ప్రయాణం ప్రారంభించాలనేది వారి ప్లాన్. కానీ, ధరమ్‌వీర్ మాత్రం ఎంతకీ నిద్ర లేవలేదు.

అచేతన స్థితిలో ఉన్న ధరమ్‌వీర్‌ను చూసి మిగతా కూలీలు హతాశులయ్యారు. పోలీసులకు ఫోన్ చేసి వారి సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. చాలా దూరం సైకిల్‌ తొక్కడం, సరైన ఆహారం లేకపోవడంతో ధరమ్‌వీర్ నీరసించి చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

ధరమ్‌వీర్‌ మృతదేహాం నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌‌గా తేలింది. అనంతరం షాజహాన్‌పూర్‌ పోలీసులు యువకుడి మృతదేహాన్ని వారి స్వస్థలం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వలస కార్మికులు సాహస ప్రయాణాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని.. స్థానిక అధికారులను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here